Groundnut Season : వేరుశనగలో పెరుగుతున్న చీడపీడల ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన చర్యలు  

Groundnut Season : వేరుశనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా వుంటుంది. పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే...దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.

Groundnut Season : వేరుశనగలో పెరుగుతున్న చీడపీడల ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన చర్యలు  

Pests and Diseases in Groundnut

Updated On : January 2, 2025 / 2:31 PM IST

Groundnut Season : నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్థుతం 20 నుండి 60 రోజుల దశలో పంట వుంది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల బెడద అధికమవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మొదలు కుళ్లుతెగులు, లద్దెపురుగుల తాకిడి అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడంతో సమయానుకూలంగానే  రైతులు విత్తుకున్నారు.  చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో వేరుశనగ గింజ కట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా పొగాకు లద్దెపురుగు, మొదలు కుళ్లు తెగులు వల్ల చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల లేక గిడసబారినట్లు కనిపిస్తోంది.

వేరుశనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా వుంటుంది. పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే…దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ పురుగు ఆకులపై పత్రహరితాన్ని తినివేసి, కేవలం ఈనెలను మాత్రమే మిగులిస్తుంది. ఈ పురుగులు పగటి వేళ మొక్కల అడుగున లేదా మట్టి పెళ్ళల కింద దాగి, రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎకరాకు 4 నుండి5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడు మొక్కలు 30 నుండి 40 ఉండేలా విత్తుకోవాలి.

పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేసుకోవాలి. ఎకరాకు 8 నుండి 10 పక్షి స్థావరాలు అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు నొవాల్యూరాన్ 200 మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీ లీటర్లు ఒక ఎకరాకు సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పురుగుల ఉధృతి అధికంగా ఉంటే విషపు ఎర తయారు చేసుకోవాలి ఇందు కోసం 5 కిలోల వరితవుడు, అరకిలో బెల్లం, మోనోక్రోటోఫాస్ 500 మిల్లీ లీటర్ల కలిపి సాయంత్రం వేళలో  పొలంలో సమానంగా చల్లుకోవాలి.

వేరుశనగలో ప్రస్తుతం మొదలుకుళ్లు తెగులు ఆశించించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ముఖ్యంగా విత్తనం మొలకెత్తిన తరువాత నేలకు ఆనుకొని కాండంపైన నల్లని శిలీంధ్రబీజాలతో కప్పబడి ఉంటుంది. విత్తన శుద్ధి చేయని పరిస్థితుల్లో ఈ తెగులు అధికంగా ఆశింస్తుంది. దీని నివారణకు పంట మార్పిడి తప్పని సరిగా పాటించాలి. కార్బెండిజమ్ + మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కచుట్టు నేలను తడపాలి.

Read Also : Groundnut Cultivation : రబీ వేరుశనగ సాగుకు సిద్ధమవుతున్న రైతులు – అధిక దిగుబడులకోసం మేలైన రకాలు