Sunflower Crop : రబీకి అనువైన ప్రొద్దుతిరుగుడు రకాలు – అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం 

వంటనూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచదేశాలన్నిటి కంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవటం వల్ల  ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.

Sunflower Crop : రబీకి అనువైన ప్రొద్దుతిరుగుడు రకాలు – అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం 

Sunflower Crop Cultivation in Rabi Season

Updated On : December 19, 2024 / 2:32 PM IST

Sunflower Crop : నూనెగింజల పంటల సాగుకు మనదేశంలో అనువైన పరిస్థితులు ఉన్నా… విస్తీర్ణం చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా యాజమాన్య లోపాల వల్ల, ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు రైతులు. ప్రస్థుతం  అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనెగింజ పంటల్లో ప్రొద్దుతిరుగుడును ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు అన్నిసీజన్ లలోను సాగుచేయదగ్గ ఈ పంటలో దిగుబడులు నామమాత్రంగా వున్నాయి. ప్రస్థుతం రైతులు వేసవి పంట సాగుకు సిద్ధమవుతున్నారు.  ఈ నేపధ్యంలో ప్రొద్దుతిరుగుడు సాగులో అనువైన రకాలు.. అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి  యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

వంటనూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచదేశాలన్నిటి కంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవటం వల్ల  ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఇది దేశానికి పెనుభారంగా వుంది. ఆయిల్ పామ్, ఆవాలు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ వంటి నూనెలు ప్రధానంగా ఈ దిగుమతుల్లో వున్నాయి. ఏటా దిగుమతులు పెరగటమేకానీ తగ్గే పరిస్థితులు కనిపించటం లేదు.

అయితే ఈ ఏడాది నూనెగింజలకు  ప్రకటించిన కనీస మద్ధతు ధరలు రైతుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. తెలుగు రాష్ట్రాల్లో వున్న నూనె పంటల్లో సంవత్సరం పొడవునా… అన్నికాలాల్లో సాగుచేయదగ్గ పంట ప్రొద్దుతిరుగుడు.. దాదాపు 5లక్షల 60వేల ఎకరాల్లో దీని విస్తీర్ణం వుంది.  దీనిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్ లు అందుబాటులో వున్నా…ఎక్కువ శాతం మంది రైతులు ఎకరాకు 4,5క్వింటాళ్లకు మించి దిగుబడి నమోదుచేయలేకపోతున్నారు.

ఈ నేపధ్యంలో  హైద్రాబాద్ లోని జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్  శాస్త్రవేత్తలు ప్రొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్యం పట్ల రైతులకు అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నారు.. ముఖ్యంగా రబీ వేసవి కాలాల్లో నీటి వసతి కింద దీని సాగు వుంటుంది. పైగా ఈకాలాల్లో చీడపీడల బెడద తక్కువగా వుండి, అనుకూల వాతవరణం  వుంటుంది. రబీ పంటను నవంబరు నుంచి డిసెంబరు వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటను జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే  హైబ్రిడ్ రకాలు, సాగు యాజమాన్యం గురించి జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి. సురేష్  రైతాంగానికి తెలియజేస్తున్నారు.

ప్రొద్దుతిరుగుడు  పంటకాలం 90 నుంచి 100 రోజులు. స్వల్పకాలిక పంట కావటంతో రైతులు హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకుని అధిక దిగుబడి పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తేటప్పుడు భూమిలో సేంద్రీయ కర్భనశాతం ఎక్కువ వుండేటట్లు చూసుకుని, నియమబద్దంగా పోషకాలు అందించాలి. దీనివల్ల మొక్కలు ఏపుగా దృఢంగా పెరిగి, అధిక రోగ నిరోధక శక్తితో పెరుగుతాయి.

కలుపు మొక్కల చీడపీడలకు నిలయాలు. అందువల్ల ప్రొద్దుతిరుగుడు విత్తిన 48 గంటలలోపు  కలుపు నివారణకు పెండిమిథాలిన్  5 మిల్లీలీటర్లు, లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారిచేయాలి. 30 రోజుల తర్వాత గుంటక, దంతులతో అంతరకృషి  చేసినట్లయితే కలుపును సమర్ధంగా అరికట్టవచ్చు. ప్రొద్దుతిరుగుడులో పువ్వు తయారయ్యేటప్పుడు  రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య, తాలు గింజలు ఏర్పడటం.

ఫలదీకరణం సక్రమంగా జరగకపోవటం,  యాజమాన్య లోపాలు, దీనికి ప్రధాన కారణమంటారు డా. సురేష్. ప్రొద్దుతిరుగుడు  పువ్వు  గింజకట్టే  దశలో  పక్షుల బెడద లేకుండా చూసుకోవాలి.  కలర్ రిబ్బన్లు కట్టటం, పంటకు కాపలాకాస్తూ శబ్ధాలు చేయటం ద్వారా వీటిబారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో చీడపీడలను అరికట్టాలి. దీనివల్ల ఎకరాకు 8 – 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. ప్రస్థుతం మద్ధతు ధర ఆశాజనకంగా వుండటం వల్ల, మంచి ఆదాయం సాధించే అవకాశం వుంది.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు