విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చింది, తగ్గింది.. లక్షణాలు లేని వారే ఎక్కువ, నెల రోజుల్లో ఇంకా తగ్గనున్న కేసులు

  • Published By: naveen ,Published On : August 20, 2020 / 10:06 AM IST
విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చింది, తగ్గింది.. లక్షణాలు లేని వారే ఎక్కువ, నెల రోజుల్లో ఇంకా తగ్గనున్న కేసులు

Updated On : August 20, 2020 / 10:34 AM IST

విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందా? ఎక్కువమందిలో లక్షణాలు లేకుండానే కరోనా సోకిందా? నెల రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ‘సిరో సర్వైలెన్స్‌’ను నిర్వహించింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనాలకు కాస్త ఊరటనిచ్చాయి.



లక్షణాలు లేని వారే ఎక్కువ:
విజయవాడ, పరిసర ప్రాంతాల్లో సిరో సర్వైలెన్స్‌, వివిధ రకాల వైరస్‌ నిర్ధారణ పరీక్షల నివేదికలను పరిశీలిస్తే 43.81(40.51+3.3) శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురైనట్లు అధికారులు తేల్చారు. ఇందులో 40.51శాతం మందికి కరోనా సోకి.. పోయినట్లు సిరో సర్వైలెన్స్‌లో తేలింది. వీరిలో ఎవరికీ అనుమానిత లక్షణాలు లేకపోవడం గమనార్హం. వీరి రక్త నమూనాలు పరీక్షిస్తేనే వైరస్‌ వారిలోకి వచ్చి వెళ్లినట్లు తెలిసింది. మిగతా 3.3శాతం మంది అనుమానిత లక్షణాల ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు.

* కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందిలో 19.41% మందికి వైరస్‌ వచ్చి.. వెళ్లింది.
* విజయవాడ అర్బన్‌లో 933 మందిలో 378మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది.
* భవంతులు, గుడిసెలు, చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్‌ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. * నగరంలో వైరస్‌ తీవ్ర ప్రభావిత ప్రాంతమైన కృష్ణలంకలో 39 మంది నమూనాలు పరీక్షించగా 16 మందికి వైరస్‌ సోకి నయమైనట్లు తేలింది. * రాణిగారితోటలో 40 మందిలో 29, లంబాడిపేటలో 38-18, రామలింగేశ్వరనగర్‌ 43-18, దుర్గాపురం 43-17, మధురానగర్‌-32-20, గిరిపురం-33-18, ఎన్టీఆర్‌ కాలనీ-43-16, ఆర్‌ఆర్‌పేట-40-16, లబ్బీపేట-21-4, పటమటలో 13 మంది నమూనాలు పరీక్షించగా అయిదుగురిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.
* గ్రామీణ పరిధిలోని కానూరులో 69మందిలో 8, గొల్లమూడిలో 150-14, చిన్నఓగిరాలలో 134-15, గొల్లపల్లిలో 140 మందిని పరీక్షిస్తూ 9మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.
*మే లో వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులు పరిగణనలోనికి తీసుకొని ఈ పరీక్షలు చేశారు.



కరోనాను కట్టడి చేయగలుగుతున్నాం:
”ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు జరిగిన సిరో సర్వైలెన్స్‌లో అనుమానిత లక్షణాలు కనిపించ లేదని చెప్పిన వారికి మాత్రమే పరీక్షలు చేశాం. విజయవాడలో లక్షా 80వేల మందికి పరీక్షలు చేయగా 6వేల మందికి వైరస్‌ సోకింది. నెల రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయని భావిస్తున్నాం. ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారి సంఖ్యను నగర జనాభాతో సాంకేతిక మదింపు చేయగా 43.81మందికి వైరస్‌ సోకిందని అధికారులు అంచాన వేశారని” కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.



ఏపీలో 3లక్షలు దాటిన కరోనా కేసులు:
కాగా, ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా గత రెండు రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం(ఆగస్టు 19,2020) రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 57వేల 685 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9వేల 742 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3లక్షల 16వేల 003కు చేరింది.



3వేలకు చేరువలో కరోనా మరణాలు:
కరోనా మరణాలు కూడా తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 86 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 2వేల 906కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరులో 15 మంది, అనంతపురంలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

బుధవారం 8వేల 061 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 3లక్షల 16వేల 003 పాజిటివ్ కేసులకు గాను, 2లక్షల 26వేల 372 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 86వేల 725 మంది ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.