టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేత

Sabbam Haris residence demolished: అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారులతో సబ్బం హరి వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రహరీని ఎలా తొలగిస్తారని నిలదీశారు.
జగన్ ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించినందుకే కూల్చివేతకు దిగారని సబ్బం హరి ఆరోపించారు. ప్రశ్నించే వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సబ్బం హరిని ఇబ్బందులు పెడితే అందరూ భయపడతారని ప్రభుత్వం భావిస్తోందని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను మాత్రం వెనక్కి తగ్గబోనని తెలిపారు.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణం:
సబ్బం హరి ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసి టాయిలెట్‌ను నిర్మించారని అధికారులు ఆరోపిస్తున్నారు. 12 అడుగుల పార్క్ స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారని చెబుతున్నారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారని చెప్పారు. దీంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని అధికారులు నోటీసులు జారీచేశారు. నోటీసులకు సబ్బం హరి పట్టించుకోకపోవడంతో, శనివారం(అక్టోబర్ 3,2020) ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు.
సబ్బం హరి ప్రభుత్వ స్థలం కబ్జా చేశారు:
ఈ వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర స్పందించారు. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారు. రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వంది. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాము. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశాము. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జారీ చేసాము. నోటీసుకు సబ్బం హరి స్పందించ లేదు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము’ అని తెలిపారు.
కూల్చడమంటూ చేపడితే జగన్ ఇంటి నుంచే ప్రారంభించాలి: బుద్దా వెంకన్న
దీనిపై టీడీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ చెప్పిన దేవుడి స్క్రిప్టే వచ్చే ఎన్నికల్లో పునరావృతం అవుతుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నారో ఆ సంఖ్యే వారికి మిగులుతుందన్నారు. ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకే సబ్బం హరి ఇంటిని పడగొట్టారని బుద్దా వెంకన్న ఆరోపించారు. లోటస్ పాండ్, తాడేపల్లి రాజ్ మహల్ వంటిని అవినీతి పునాదులపై కట్టిన ఇళ్లు అన్నారు. కూల్చడమంటూ చేపడితే జగన్ ఇంటి నుంచే ప్రారంభించాలన్నారు బుద్దా వెంకన్న.
అసమర్ధులే కక్షపూరిత రాజకీయాలు చేస్తారు: చంద్రబాబు
సబ్బం హరి ఇంటిని కూల్చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని చంద్రబాబు ప్రశ్నించారు. మాజీ ఎంపీకే ఈ పరిస్థితి వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. అసమర్ధులే కక్షపూరిత రాజకీయాలు చేస్తారని చంద్రబాబు అన్నారు.