Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజినీపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

vidadala rajini,
Vidadala Rajini: మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత విడదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. రజనీతోపాటు పలువురిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బి సెక్షన్లను వర్తింపజేస్తూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
2020 సెప్టెంబర్ నెలలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో విడుదల రజనీని ఏ1 నిందితురాలిగా అధికారులు చేర్చారు. ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ2గా విడుదల రజిని మరిది విడుదల గోపి, ఏ4గా రజిని పీఏ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు.
ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్ల ఆరోపణలపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్ గుప్తా విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో తాజాగా కేసు నమోదు చేశారు.