Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడే విచారణ.. తీర్పుపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారించనుంది. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ విషయంలో చంద్రబాబుపై జారీ అయిన రెండు పీటీ వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం ఉంది. Chandrababu Bail

Chandrababu Naidu Bail Petition
Chandrababu Bail Petition : విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్, కస్టడీకి సంబంధించి హాట్ హాట్ గా వాదనలు జరిగాయి. చంద్రబాబు కస్టడీ పొడిగించాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. అయితే మెకానికల్ గా ఇవ్వలేనని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. పిటిషన్ వేస్తే పరిశీలిస్తామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీఐడీ తరపున వివేకానంద, చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కాగా, చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో.. రిమాండ్ ను మరో 11 రోజులు (అక్టోబర్ 5) పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రిమాండ్, రెండు రోజుల కస్టడీ ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వర్చువల్ గా చంద్రబాబును న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి, చంద్రబాబు మధ్య రెండు నిమిషాల పాటు సంభాషణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్యం గురించి న్యాయమూర్తి వాకబు చేశారు.
రేపు బెయిల్, పీటీ వారెంట్లపై విచారణ..
మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రేపు (సెప్టెంబర్ 25) ఏసీబీ కోర్టు విచారించనుంది. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ విషయంలో చంద్రబాబుపై జారీ అయిన రెండు పీటీ వారెంట్లపైనా రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబుకి రేపు బెయిల్ లభిస్తుందా? లేదా? కోర్టు నిర్ణయం ఏంటి? అనేది సర్వత్రా తీవ్ర ఉత్కంఠగా మారింది.
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణ గురించి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది ఆదిత్య వివరాలు వెల్లడించారు. ” చంద్రబాబుని న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ లోకి తీసుకున్నారు. విచారణ ఎలా జరిగింది? కస్టడీ అంతా కంఫర్టబుల్ గా ఉందా లేదా? అని అడిగారు. టైమ్ కి విచారణ జరిగిందా లేదా అని అడిగారు. కాస్త ల్యాగ్ అయిందని చంద్రబాబు చెప్పారు. లేటుగా విచారణ స్టార్ట్ చేశారని చంద్రబాబు తెలిపారు.
నేను ఏ తప్పు చేయలేదని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు. ఇన్ని రోజుల్లో జైల్లో ఉంచడం అనేది నాకు కరెక్ట్ గా అనిపించడం లేదన్నారు. ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని, దర్యాఫ్తు జరుగుతోంది కాబట్టి, ఈ దశలో మీరు తప్పు చేశారని నమ్మడం కాదు, తదుపరి విచారణ జరిపి అదేంటి? అని ప్రూవ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని విచారణ జరుగుతుంది అని న్యాయమూర్తి తెలిపారు. అందువల్లే జ్యుడీషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించారు న్యాయమూర్తి.
విచారణకు సంబంధించి ప్రభుత్వం సబ్మిట్ చేసిన 600 పేజీల డాక్యుమెంట్ ను తనకు ఇవ్వాలని చంద్రబాబు కోరగా, అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. ఆ డాక్యుమెంట్స్ కాపీ మీకు కచ్చితంగా ఇవ్వాలని నేను ఆదేశిస్తాను అని న్యాయమూర్తి చెప్పారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారని, అది రేపు లేదా ఎల్లుండి లిస్ట్ అవ్వొచ్చని న్యాయమూర్తి అన్నారు” అని టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది ఆదిత్య తెలిపారు.
చంద్రబాబుపై 2వేల పేజీల్లో 600 అభియోగాలు..
సీఐడీ కస్టడీలో విచారణకు తాను పూర్తిగా సహకరించాను అని చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి వెల్లడించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై జడ్జి స్పందించారు. మీపై 2వేల పేజీల్లో 600 అభియోగాలు ఉన్నాయని, సీఐడీ ప్రాథమిక సాక్ష్యాలను కూడా సమర్పించిందని వివరించారు. ఆ డాక్యుమెంట్స్ తనకు చూపించాలని చంద్రబాబు కోరగా.. అందుకు జడ్జి అంగీకరించారు. అభియోగ పత్రాల కాపీని చంద్రబాబు లాయర్లకు ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి.
తాను విచారణకు పూర్తిగా సహకరించాను అని చంద్రబాబు చెబుతుంటే.. విచారణకు చంద్రబాబు సహకరించలేదని సీఐడీ తరపు న్యాయవాదులు అంటున్నారు. అంతేకాదు చంద్రబాబుని మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేస్తే.. కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిపై వాదోపవాదాలు విన్న తర్వాత తన విచక్షణా అధికారం మేరకు కస్టడీ పిటిషన్ పై తుది నిర్ణయం చెబుతారు న్యాయమూర్తి.