సీఎం జగన్ ఇంటికెళ్లే మార్గాలన్నీ మూసివేత

సీఎం జగన్ ఇంటికెళ్లే మార్గాలన్నీ మూసివేత

Updated On : February 2, 2021 / 3:15 PM IST

all ways closed to cm jagan house: ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. అమరావతిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లే రోడ్లను భారీ గేట్లతో పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీ నేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం ఇంటికి వెళ్లే మార్గాలన్నీ మూసేశారు.

సీఎం జగన్ నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆయన నివాసానికి వెళ్లే మార్గంలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని దారుల దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గానీ వదలడం లేదు. కొంచెం అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.

ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అరెస్ట్, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనలు కలకలం రేపాయి. వీటిని చంద్రబాబు, టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా సీఎం జగన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పారు. దీంతో టీడీపీ నేతలు జగన్ ఇంటికి బయలుదేరారు. వరుసగా టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులతో పాటు దాడులు జరుగుతున్న తీరును జగన్ కు వివరిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జగన్ నివాసానికి వెళ్లే రోడ్లను క్లోజ్ చేశారు.