రాజధాని రచ్చ : పండుగపూట పోరుబాట

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ… అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతికి మద్దతుగా ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించింది. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని ప్రాంతంలోని మహిళలు సంక్రాంతి ముగ్గుల ద్వారా నిరసన తెలుపుతున్నారు. సేవ్ అమరావతి అంటూ రంగవల్లులు వేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి అని అంటూ వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదాలు చేశారు. వెలగపూడిలో ఎక్కడ చూసినా సేవ్ అమరావతి, సేవ్ ఏపీ ముగ్గులే దర్శనమిస్తున్నాయి.
DGP గౌతం సవాంగ్‌ను కలిసిన మహిళలు, రైతులు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలు డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిశారు. ఆయనకు వినతిపత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలో పోలీసుల దాడులు, కేసుల గురించి డీజీపీతో చర్చించారు. శాంతియుతంగానే ధర్నాలు చేస్తున్నామని సవాంగ్‌కు రైతులు వివరించారు. కేసులు, దాడి అంశాలను పరిశీలిస్తానని డీజీపీ హామీ ఇచ్చారు.
త్యాగాలకు సిద్ధమంటున్న జేఏసీ
అమరావతిని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని జేఏసీ నేతలు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పరిరక్షణ సమితితో కలిసి నిరసనోద్యమంలో పాల్గొన్నారు. జగన్ మూడు రాజధానల ప్రతిపాదనపై మండిపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని చెప్పారు.
బాబు జోలే ద్వారా రూ. 62 లక్షలు
చంద్రబాబు జోలె పట్టుకోవడం ద్వారా ఇప్పటి వరకు 62 లక్షలు వచ్చాయన్నారు. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో 2020, జనవరి 15వ తేదీ బుధవారం ముగ్గులతో నిరసన… 2020, జనవరి 16వ తేదీ గురువారం చనిపోయిన రైతుల ఫొటోలతో ఆందోళనలు… 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 2020, జనవరి 20వ తేదీన జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజధాని ఉద్యమం పట్ల పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
బాలయ్య రాక
మరోవైపు 2020, జనవరి 15వ తేదీ బుధవారం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. బాలకృష్ణతో పాటు భార్య వసుంధర, లోకేష్, బ్రాహ్మణి కూడా రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో నిరాహార దీక్ష శిబిరాలను బాలయ్య సందర్శించనున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులకు ఇప్పటికే హీరో నారా రోహిత్, నిర్మాత అశ్వనీదత్, సింగర్ స్మిత సంఘీభావం తెలిపారు. అగ్ర కథాయకుడు బాలయ్య కూడా మద్దతు తెలపడంతో రాజధాని ప్రాంత గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నటులు కూడా తమకు సంఘీభావం తెలపాలని కోరుతున్నారు.
Read More : ముహూర్తం ఖరారు : ఏపీ కేబినెట్ మీటింగ్