AP Assembly Session: 4 బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ముగిశాయి. మళ్లీ మంగళవారం ఉదయం ప్రారంభం కానున్నాయి.

AP Assembly Session
మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
LIVE NEWS & UPDATES
-
మహిళా బిల్లుకు మద్దతుగా తీర్మానం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. అంతకుముందు ఏపీలో మహిళా సాధికారతపై చర్చ జరిగింది. సీఎం జగన్ ఏపీలో మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారు.
-
అందరూ అభినందించాలి: ధర్మాన
ప్రభుత్వం గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని, వీటిని అందరూ అభినందించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సమగ్ర భూసర్వేపై అసెంబ్లీ జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏ సంస్కరణ తీసుకొచ్చినా అవినీతి లేకుండా చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. తాము భూ సర్వేను రైతుపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చేశామన్నారు.
-
నాలుగు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం
ఏపీ అసెంబ్లీ నాలుగు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది..
ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లు 2023కు ఆమోదం
ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు 2023కు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లు 2023కు ఆమోదం
ఏపీ వస్తు సేవల పన్నుల సవరణ బిల్లు 2023కు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతం అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులను అన్నివిధాల ఆదుకుంటామని అన్నారు.
-
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మహిళల సాధికారతపై చర్చించనున్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేయనుంది. అనంతరం అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, భూ సంస్కరణలపై చర్చ జరగనుంది.
-
ఈరోజు సభలో వైసీపీ ప్రభుత్వం తొమ్మిది బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులపై చర్చ కొనసాగనుంది.
-
అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వనందున ప్రభుత్వ తీరుకు ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెప్తామని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే టీడీఎల్పీ భేటీలో తదుపరి కార్యాచరణ పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
-
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై చర్చించనున్నారు.
-
తొలిరోజు సమావేశాల్లో కొందరు సభ్యులు సస్పెన్షన్ అనంతరం టీడీపీ ఈ సెషన్‌ను బహిష్కరించింది.
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు కొనసాగిన సమావేశాలకు శని, ఆదివారం బ్రేక్ పడింది. దీంతో సోమవారం మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి.