Weed Killer Ban : ఏపీ రైతులకు అలర్ట్.. ఆ మందుపై నిషేధం.. కాదని వాడితే కఠినంగా
Weed Killer Ban : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కీలక అలర్ట్ జారీ చేసింది.
andhra pradesh government ban on weed killer for 60 days
Weed Killer Ban : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా రైతన్నల కోసం ముఖ్యమైన ప్రకటన చేసింది. గడ్డి మందుపై నిషేధం విధించింది. 60 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతోపాటు కాల్వలు, చెరువుల్లో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వాట్ డీక్లోరైడ్ 24 శాతం ఎస్ఎల్ మందు ఉత్పత్తి, అమ్మకం, నిల్వలు, పంపిణీ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. అలానే ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోన్న ఈ గడ్డి మందును అన్ని రూపాల్లో నిషేధిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ మందు తయారీదారులు, పంపిణీదారులు, డీలర్లు, రిటెయిలర్లతో పాటుగా వినియోగించేవారు.. దీన్ని తప్పక అమలు చేయాలని సూచించారు.
అత్యంత విషపూరితం
- తాజాగా ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన పారాక్వాట్ డీక్లోరైడ్ గడ్డి మందు అత్యంత ప్రమాదకరమైన గడ్డి సంహారిణి.
- గ్రామీణ, వ్యవసాయాధారిత ప్రాంతాల్లో ఈ మందు వినియోగం వల్ల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
- ఈ మందు అత్యంత తక్కువ పరిమాణంలో అయినా సరే శరీరంలోకి చేరితే.. అది ప్రాణాంతకంగా మారుతుంది. పైగా దీనికి ఎలాంటి విరుగుడు లేదని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి.
- ఈ క్రమంలో ఈ గడ్డి మందుని నిషేధించాలని కోరుతూ వైద్యఆరోగ్యశాఖ కూడా విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇచ్చిన నివేదికల్ని జతపరిచింది.
- అత్యంత విషపూరితమైన ఈ పారాక్వాట్ డీక్లోరైడ్ గడ్డి మందు తాగిన వారు నిమిషాల వ్యవధిలోనే చనిపోతున్నారని.. ఇటీవల ఈ మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటనల్ని డీజీపీ ప్రస్తావించారు.
- అందుకే ఈ మందు నిషేధానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఈ సూచనల నేపథ్యంలో వ్యవసాయశాఖ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.
- కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మందు దుష్ప్రభావాల్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
- ఈ మందు ప్రభావం వల్ల కిడ్నీలు దెబ్బతినడంతోపాటు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి.
- అలానే ఈ మందు మెదడులోని నాడీ వ్యవస్థను దెబ్బతీసే పార్కిన్సన్స్ వ్యాధికి కారణమవుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
- తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది మార్చిలో దాన్ని 60 రోజుల పాటు నిషేధించింది. దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరింది. ఒడిశాలోనూ చర్యలు చేపట్టారు.
