AP Pension : ఏపీలో పెన్షనర్లకు అలర్ట్.. పెన్షన్ రద్దైన, డబ్బులు ఆగిపోయిన వారికి గుడ్‌న్యూస్.. వెంటనే ఇలా చెయ్యండి! కొద్దిరోజులు మాత్రమే..

రీ-అసెస్‌మెంట్‌లో అర్హులుగా తేలిన వారికే నవంబర్ నుంచి పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పెన్షన్ రావట్లేదని ఆవేదన చెందుతున్న వారికి ఇదో మంచి అవకాశం

AP Pension : ఏపీలో పెన్షనర్లకు అలర్ట్.. పెన్షన్ రద్దైన, డబ్బులు ఆగిపోయిన వారికి గుడ్‌న్యూస్.. వెంటనే ఇలా చెయ్యండి! కొద్దిరోజులు మాత్రమే..

AP Pension Reassessment

Updated On : October 8, 2025 / 7:19 AM IST

AP Pension Reassessment: ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం కింద అర్హులకు ప్రతీనెలా పెన్షన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో దివ్యాంగుల పెన్షన్ రద్దైనా లేదంటే పెన్షన్ రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి రీ అసెస్మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ (బుధవారం) నుంచి మూడు రోజులపాటు వికలాంగుల పెన్షన్లు రీ అసెస్‌మెంట్ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.

రీ-అసెస్‌మెంట్‌లో అర్హులుగా తేలిన వారికే నవంబర్ నుంచి పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో తమకు పెన్షన్ రావట్లేదని ఆవేదన చెందుతున్న వారికి ఇదో మంచి అవకాశం అనుకోవచ్చు. ఈ టెస్టుల ప్రక్రియలో పాల్గొని తమకు పెన్షన్ వచ్చేలా చేసుకునే వీలు ఉంటుంది. వికలాంగ శాతం 85శాతం పైబడిన వైకల్యం ఉన్నవారికి, మంచానికి పరిమితమైన వారికి రూ.15వేలు అందిస్తారు. 85శాతం కంటే తక్కువ ఉండి 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి రూ.6వేలు అందజేస్తారు. అదేవిధంగా 40శాతం కంటే తక్కువ వైకల్యం ఉంటే రూ.4వేలు ప్రతీనెలా ప్రభుత్వం అందిస్తుంది.

Also Read: Paritala Vs Thopudurthi: పరిటాల వర్సెస్ తోపుదుర్తి.. రోజురోజుకు వేడెక్కుతున్న రాప్తాడు రాజకీయం

8వ తేదీ (బుధవారం) నుంచి రీ అసెస్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఎంపీడీవో లాగిన్‌లో షెడ్యూల్ కేటాయించిన వారికి డబ్ల్యూఈఏ లాగిన్ నందు నోటీసులు జనరేట్ చేశారు. అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి నోటీసులు జారీ చేసి రీ అసెస్‌మెంట్‌కు హాజరవ్వాలని కోరనున్నారు. ఈ రీ అసెస్‌మెంట్‌కు సంబంధించి సచివాలయాల వారీగా పరిశీలన కోసం తేదీలు కేటాయించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

ఈ రీ అసెస్‌మెంట్‌కు సంబంధించి పంచాయతీ రాజ్, వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులు.. అప్పీల్ చేసిన లబ్ధిదారులకు తేదీలను కేటాయిస్తారు. ఆ ప్రకారమే బుధవారం, గురువారం, శుక్రవారాల్లో పరిశీలన ఉంటుంది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీసీహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ల సహాయంతో లబ్ధిదారులను ఆస్పత్రులకు మ్యాప్ చేస్తారు. ఆ ప్రకారం లబ్ధిదారులు ఆయా ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల తరువాత కొత్త సదరం సర్టిఫికెట్లు ఇస్తారు.

రీ అసెస్‌మెంట్‌కి హాజరుకాని వారికి పెన్షన్లు రావు. అలాగే తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందాలని చూసేవారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. అందువల్ల టెస్టులు చేయించుకోవాలి అనుకునే వారు తప్పనిసరిగా అసలైన పత్రాలనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ పొందలేక పోతున్న దివ్యాంగులకు ఇదే మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుంటే నవంబర్ నెల నుంచి అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ వస్తుంది.

గత ప్రభుత్వం హయాంలో వికలాంగ పెన్షన్ల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తప్పుడు పత్రాలతో దివ్యాంగ పెన్షన్లు పొందిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రీ వెరిఫికేషన్ (పున: పరిశీలన) కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు నెలలుగా అనర్హులను గుర్తించి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. అయితే, ఈ వ్యవహారంలో కొంత గందరగోళం ఏర్పడటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నోటీసులు అందుకున్నవారు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే పింఛన్‌ విషయంలో అనర్హులుగా తేలి.. ఇటీవల నోటీసులు అందుకున్నవారిలో చాలామంది అప్పీల్ చేసుకున్నారు. వారందరికి మరోసారి నోటీసులు జారీచేసి ఈనెల 8 నుంచి రీ అసెస్‌మెంట్ ప్రారంభించనున్నారు.