ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌పై వేటు, ప్రత్యేక ఆర్డినెన్స్ అస్త్రాన్నివాడిన సిఎం జగన్

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు మార్పు చేస్తూ.. 2020, ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి.
గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే..ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రెండు జీవోలను కాన్ఫిడెన్షియల్ గా పెట్టింది. ప్రభుత్వం తీసుకన్న నిర్ణయంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ..ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం రమేశ్ కుమార్ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన్ను తొలగిస్తూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవలే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ..ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో సీఎం జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
ఈసీ రమేష్ కుమార్‌ను నియమించింది బాబు అని, వీరిద్దరి సామాజిక వర్గం ఒక్కటే అని..అందుకే ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. సీఎం జగన్ నేరుగా గవర్నర్‌కు 2020, మార్చి 15వ తేదీ ఆదివారం ఫిర్యాదు చేశారు.
ఈసీ రమేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని, దీనిపై తాము ఎంతదాకైనా వెళుతామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈయన చేసిన ఆరోపణలకు ఈసీ రమేశ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనాపై జాతీయస్థాయిలో హెచ్చరికలు, సంప్రదింపుల తర్వాతే ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గితే..ఆరు వారాలు లేదా అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా రమేశ్ కుమార్ ను ప్రభుత్వం తొలగించింది.