మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేస్తోంది.. రేపు రైతుల అకౌంట్లలో డబ్బు.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో: చంద్రబాబు
"చెప్పిన మాట మేరకు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం" అని చంద్రబాబు అన్నారు.

భారత్‌లో అధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లాలోని గూడెంచెరువులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు.
“ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో ఫ్రీ బస్ సౌకర్యం ప్రారంభిస్తున్నాం. రేపు రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ డబ్బులు పడతాయి. ఏపీలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పీ4 అంటే బంగారు కుటుంబాలకు మార్గదర్శి.
మహానాడు లో చెప్పిన మాట ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం. 2028 డిసెంబర్ కి స్టీల్ ప్లాంట్ ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. చెప్పిన మాట మేరకు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం.
Also Read: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథక అక్రమాల విలువ రూ.1,000 కోట్లపైనే: ఈడీ సంచలన ప్రకటన
ఇండియా గ్రాండ్ కెన్యాన్ గండికోట. దాని సుందరీకరణకు 80 కోట్ల రూపాయల కేటాయింపులు చేస్తున్నాం. గండికోట పెద్ద దర్గా ఒంటిమిట్ట అనుసంధానిస్తాం. రాయలసీమ తర్వాత చెన్నైకి నీళ్లు అని చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆలోచనతో పుట్టినవే హంద్రీనీవా గాలేరు నగరి.
ఈ ఎన్నికల్లో కడపలో పదిలో ఏడు సీట్లు ఇచ్చారు, మీ రుణాన్ని తీర్చుకోవాలి. రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు ఇచ్చే బాధ్యత మీదే. రాయలసీమ ను హార్టీ కల్చర్ క్లబ్ గా మారుస్తా . ఉద్యోగ, ఉపాధి కోసం బయటి ప్రాంతం నుంచి సీమకు వచ్చేలా చేస్తాం” అని అన్నారు.