AP PRC : పెన్షన్లు, జీతాల బిల్లుల ప్రక్రియ చేపట్టాలి.. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవు
జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని సూచించింది. బిల్లుల ప్రక్రియ..

Ap Govt
Andhra Pradesh PRC Issue : ఏపీ సర్కార్, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య తలెత్తిన పీఆర్సీ వివాదం సమసిపోవడం లేదు. అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఉద్యోగులు గానీ.. వెనక్కి తగ్గడం లేదు. జనవరి శాలరీని.. రివైజ్డ్ పే స్కేల్ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశించింది. అయితే.. ట్రెజరీ ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగం కావడంతో.. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాలేదు. లెటెస్ట్ గా…జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని సూచించింది. బిల్లుల ప్రక్రియ చేపట్టకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది.
Read More : Delhi : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు సడలింపు.. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత
డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు చర్యలు తప్పవని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే అంశంపై టైమ్ లైన్ నిర్దేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. 2022, జనవరి 27వ తేదీ గురువారం సాయంత్రంలోగా బిల్లులను అప్ లోడ్ చేయాలని డీడీఓలకు సూచనలు జారీ చేసింది. శుక్రవారంలోగా…అప్ లోడ్ చేసిన బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.
Read More : Casino Controversy : గవర్నర్ దృష్టికి కాసినో వ్యవహారం.. టీడీపీ నేతల ఫిర్యాదు
ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కార్యదర్శులకు, హెచ్ వోడీలకు, కలెక్టర్లకు ఆదేశాల్లో ఆర్ధిక శాఖ వెల్లడించింది. మరోవైపు.. వేతన సవరణపై అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పీఆర్‌సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా నిర్ణయించడం.. గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. 27 శాతం ఐఆర్ ఉంటే.. 14.29 శాతం ఫిట్‌మెంట్ నిర్ణయించారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఫిబ్రవరిలో జనవరి జీతాలు అందుతాయా? లేదా? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.