AndhraPradesh: మాజీ మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల వాహనాలపైకి చెప్పులు విసిరిన వైసీపీ అసమ్మతి నేతలు
ఒక వర్గం ‘జగనన్న ముద్దు.. శంకర్ నారాయణ వద్దు’ అంటూ నినాదాలు చేసింది. మరో వర్గం ‘ధర్మవరం నాయకత్వం వద్దు... పెనుగొండ నాయకత్వం ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. మాజీ మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనంపై వారు చెప్పులు విసిరారు.

Ysrcp Flags
AndhraPradesh: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో ఉన్న వర్గ పోరు తారస్థాయికి చేరింది. వైసీపీ అసమ్మతి నేతల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం కలకలం రేపుతోంది. పెనుకొండ నియోజక వర్గ వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ‘జగనన్న ముద్దు.. శంకర్ నారాయణ వద్దు’ అంటూ నినాదాలు చేసింది. మరో వర్గం ‘ధర్మవరం నాయకత్వం వద్దు… పెనుకొండ నాయకత్వం ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. మాజీ మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనంపై ఆ వర్గం వారు చెప్పులు విసిరారు.
మరోవైపు, వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగలతో అసమ్మతి నేతలు స్వాగతం పలికారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని వైసీపీ అసమ్మతి నేతలు అడ్డగించారు. దీంతో ఆయన వాహనం అరగంట పాటు రోడ్డుపై నిలిచిపోయింది.
అసమ్మతి నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అసమ్మతి నేతలకు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చివరకు మంత్రి పెద్దిరడ్డిని వేరే మార్గంలో పోలీసులు పెనుకొండ సమావేశానికి తరలించారు. అసమ్మతి నేతలపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ అయ్యారు.