అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

ఏపీలో తిరుమల తరువాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అన్నవరం. కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారితో కలిసి రత్నగిరిపై (అన్నవరం కొండ)పై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన పుణ్య స్థలం.వైశాఖమాసం శుద్ధ దశమినాడు సత్యవతీ దేవితో సత్యదేవువి వివాహం కన్నుల పండువగా జరుగుతుంది.
మంగళవారం ( మే 14,2019) రోజు నుంచి 19 వరకు సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. వైశాఖ శుద్ధ ద్వాదశి, త్రయోదశి పర్వదినాలు ఒకేసారి కలిసి రావటంతో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు స్వామి, అమ్మవార్లను వేద పండితులు వధూవరులను చేస్తారు. దీని కోసం ముత్తయిదువలు పసుపు దంచి అనివేటి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
రత్నగిరికి క్షేత్ర పాలకులుగా ఉన్న సత్యదేవుని వివాహానికి సాక్షత్తు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. బుధవారం (మే 15)న ఆంజనేయ వాహనంపై ఊరేగుతు వచ్చిన సీతారాములు సత్యదేవుని వివాహానికి రావాలని గ్రామస్థులకు ఆహ్వానాలు పలకనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కల్యాణ మహోత్సవాలకు సీతారాములే పెద్దలుగా ఉండి వివాహ తంతు జరిపించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలలో భాగంగా 18వ తేదీ శనివారం నాడు ఉదయం 8 గంటలకు పంపా రిజర్వాయర్ లో సత్యదేవుడు, సత్యవతీ దేవీ అమ్మవార్లకు శ్రీ చక్రస్నానం సాయంత్రం, 4 గంటలకు నాకబలి, దండి యాడింపు, ధ్వాజావరోహనం, కంకణ విమోచనలు నిర్వహించనున్నారు.
19వ తేదీ రాత్రి ఏడు గంటలకు సత్యవతీ దేవీ సహిత సత్యదేవునికి నిత్య కళ్యాణ మండపంలో పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
కాగా ఈ కళ్యాణ మహోత్సవాలకు రూ.65 లక్షల ఖర్చుతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని దేవస్థానం ఈవో ఎంవీ సురేష్ బాబు తెలిపారు. కాగా ఈ ఉత్సవాలలో కొత్త గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. భక్తులకు ఏ అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.