AP Anganwadi Workers : ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపు.. ప్రభుత్వంతో అంగన్‌వాడీల చర్చలు విఫలం

తమ డిమాండ్లు నెరవేర్చేవరకు తగ్గేది లేదని అంగన్ వాడీ వర్కర్లు తేల్చి చెప్పారు. గత 15 రోజులుగా తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్ వాడీ వర్కర్స్.

AP Anganwadi Workers : ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపు.. ప్రభుత్వంతో అంగన్‌వాడీల చర్చలు విఫలం

AP Anganwadi Workers Agitations

Updated On : December 26, 2023 / 11:12 PM IST

ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీ వర్కర్స్ ప్రతినిధుల చర్చలు విఫలం అయ్యాయి. జీతాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపుపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. సమ్మె విరమించాలని అంగన్ వాడీలను కోరినా ఫలితం లేకుండా పోయింది. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు తగ్గేది లేదని అంగన్ వాడీ వర్కర్లు తేల్చి చెప్పారు. గత 15 రోజులుగా తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్ వాడీ వర్కర్స్. అంగన్ వాడీ వర్కర్స్ ప్రతినిధులతో ఏపీ మంత్రివర్గ ఉప సంఘం అమరావతిలో చర్చలు జరిపింది. అయితే చర్చలు ఫలించలేదు. దీంతో సమ్మెను కొనసాగిస్తామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్ వాడీలు ప్రకటించారు.

తమ డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు ఆందోళన బాట పట్టారు. వారి బుజ్జగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైంది. మంగళవారం ప్రభుత్వంతో నాలుగోసారి అంగన్‌వాడీ వర్కర్స్ ప్రతినిధుల చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాల పెంపు సాధ్యం కాదని జగన్ సర్కార్ తేల్చేసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీల డిమాండ్స్‌పై సుదీర్ఘంగా చర్చించామని.. 11 డిమాండ్లపై దృష్టి పెట్టామని తెలిపారు.

వేతనం పెంపుపై సమయం ఇవ్వాలని కోరామమన్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిద్దామన్నారు. ఇప్పటికే పలు డిమాండ్లు పరిష్కరించామన్న మంత్రి బొత్స.. గ్రాట్యుటీపై కోర్టుకు వెళ్లాలని సూచించారు. అంగన్‌వాడీలు సమ్మె విరమిస్తారని భావిస్తున్నామని, అంగన్‌వాడీలు సమ్మె విరమించుకుంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

అంగన్‌వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను తాము ఆమోదించామని వెల్లడించారు. వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని వివరించామని, గ్రాట్యుటీ మా పరిధిలోకి రాదని అంగన్ వాడీలకు వివరించామన్నారు. సమ్మె వల్ల ఇప్పటికే గర్భిణులకు పోషకాహారం, పిల్లలకు బాలామృతం అందడం లేదని మంత్రి బొత్స వాపోయారు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారని ఆయన ప్రశ్నించారు.

సమ్మె కొనసాగుతుంది..
ప్రభుత్వంతో చర్చలు విఫలం అవ్వడంపై అంగన్‌వాడీ వర్కర్స్ అనుబంధ సంఘాల ప్రతినిధులు స్పందించారు. ” బుజ్జగింపులు, బెదిరింపులు తప్ప సమస్యల పరిష్కారం లేదు. ప్రభుత్వంతో చర్చలు విఫలం అయ్యాయి. మా సమ్మెను ఉధృతం చేస్తాం. రేపు (డిసెంబర్ 27) అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం. వచ్చే నెల 3న కలెక్టరేట్లను ముట్టడిస్తాం. హెల్పర్లకు అన్యాయం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ ను రోడ్డుపైకి తీసుకొచ్చారు. మంత్రులు చెప్పిన రిటైర్మెంట్ బెనిఫిట్ మాకు ఆమోదయోగ్యం కాదు. 40వేలతో ఆయా ఎలా బతకాలి? గ్రాట్యుటీపై కోర్టుకు వెళ్లమంటున్నారు.

ప్రభుత్వం గ్రాట్యుటీ పెంచుతాం అంటే కోర్టులో మేము పోరాటం చేస్తాం. ఇప్పటివరకు చర్చల వివరాలను సీఎం దగ్గరికి తీసుకెళ్లలేదని మంత్రులు చెబుతున్నారు. ఇంకా సీఎం దృష్టికి తీసుకెళ్లక పోవడమేంటి? సీఎం దగ్గర వీళ్లు మంత్రులుగా ఉన్నారా.. లేదా..? అనే అనుమానం కలుగుతోంది. సంక్రాంతి తర్వాత, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక చూద్దాం అంటున్నారు. వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది” అని అంగన్ వాడీ వర్కర్స్ అనుబంధ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు.

”సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేస్తే సమస్య పరిష్కరిస్తామని మంత్రి చెబుతున్నారు. 15 రోజుల్లో ప్రభుత్వానికి ఏమైనా బంగారపు గనులు వచ్చేస్తాయా? అంగన్‌వాడీల జీతాలు పెంచడానికే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా? అంగన్‌వాడీలు మానసిక వేదనకు గురవుతున్నారు, కొందరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.