AP IT Hub: ఐటీ హబ్‌గా ఏపీ.. వైజాగ్‌కు గూగుల్, టీసీఎస్ ఇంకా.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
2047 నాటికి భారత్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంటుంది'' అని సీఎం చంద్రబాబు అన్నారు.

AP IT Hub: ఏపీ క్యాబినెట్ సమావేశంలో అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్ గా ఏపీ మారిపోతోందన్నారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు నెలకొల్పేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు చంద్రబాబు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కార్ పెట్టుబడులు తెస్తోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
”రామాయపట్నంలో త్వరలో BPCL పెట్టుబడులు పెట్టబోతోంది. విశాఖలో ఏఐ డేటా సెంటర్ రాబోతోంది. మూడేళ్లలో రూ.88వేల కోట్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుంది. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంటుంది. 2047 నాటికి భారత్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంటుంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
క్యాబినెట్ సమావేశానికి ముందు లోకేశ్ తో మంత్రులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు వాటిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారని అన్నారు. కల్తీ మద్యం విషయంలోనూ వైసీపీ పాపాలు మనపై రుద్దాలని చూస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని హోంమంత్రి అనితకు సూచించారు లోకేశ్.