Somu Veerraju : పేదల ఇంటి కలకు సాకారమెప్పుడు? సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖ
పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు..

Somu Veerraju
Somu Veerraju : ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. అంశాల వారీగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. లేఖల రూపంలో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. తాజాగా సీఎం జగన్ కు మరో లేఖ రాశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. నిర్ణీత సమయంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని లేఖలో డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడమే పేదల పాలిట శాపమైందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వకుండా సొంత డబ్బా కొట్టుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు పునాది రాళ్లకే పరిమితం అయ్యాయని సీఎంకు రాసిన లేఖలో తెలిపారు సోము వీర్రాజు.
పేదల ఇంటి కలకు సాకారమెప్పుడు? అని లేఖలో అడిగారు సోము వీర్రాజు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఎప్పుడు జమ చేస్తుందో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారాయన. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా విషయంలో ఆలస్యమే పేదల పాలిట శాపంగా మారుతోందని అన్నారు. అందుకే ప్రభుత్వానికి గుర్తు చేసే ఉద్దేశ్యంతో బహిరంగ లేఖ రాశానని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించాల్సిన లక్ష్యంతో కేంద్రం ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం లేదని సోమువీర్రాజు ఆరోపించారు.
”నయా పైసా ఇవ్వకుండా గృహ నిర్మాణానికి సంబంధించి మీ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటూ రెండున్నరేళ్లుగా కాలయాపన చేయడం వల్ల మలి విడత ఇళ్లు మంజూరు కాకపోతే నష్టపోయేది రాష్ట్రంలోని పేద ప్రజలే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం త్వరిత గతిన మేల్కొని గృహ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కనీసం లక్ష రూపాయలు మంజూరు చేస్తే కనీసం నిర్మాణం జరుగుతున్న ఇళ్ల సంఖ్యలో 80శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారుల చేతికి అందించేందుకు వీలు కలుగుతుంది.
ఈ లేఖ ద్వారా అయినా ఈ విషయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే లబ్దిదారులకు ఉన్న అనుమానాలు వీడతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి నిర్మించే ఇళ్లు తొలి దశలో 15.75 లక్షల ఇళ్లకు గాను ఇళ్ల నిర్మాణం పునాది రాళ్లకే పరిమితమైంది. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నా రాష్ట్రం స్ధల సేకరణకే పరిమితం కావడం వల్లే ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే నిలిచింది.
Statue of Equity: ఫిబ్రవరి 2 నుంచి.. వైభవంగా రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ..!
రాష్ట్ర ప్రభుత్వం లక్షా 50 వేలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం ప్రధాన కారణంగా కనపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్కో ఇంటికి ఒక్కో లక్ష మంజూరు చేసినా 80శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేవి. 2022 జనవరి నుండి మార్చి వరకు 1.18 లక్షల గృహాలు గ్రౌండింగ్ చేయడంతో పాటు 41వేల 520 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ లక్ష్యం నెరవేరడానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలి. ఆ దిశగా మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడానికి నిర్ణీత కాలవ్యవధి నిర్దేశించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవే. ఇప్పటివరకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే మరో విడత కేంద్రం ఇళ్లు మంజూరు చేయాలన్నా కుదరని పని. ముఖ్యమంత్రి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటో బహిరంగ పర్చాలని” లేఖ ద్వారా డిమాండ్ చేశారు సోమువీర్రాజు.