AP Cabinet: గుడ్‌న్యూస్.. ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా బీసీలకు ఏపీ సర్కారు రూ.20 వేలు
క్వాంటం కంప్యూటింగ్‌లో పెట్టుబడులకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
PM Surya Ghar Scheme: సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పీఎం సూర్యఘర్ కింద ఇంటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు అదనంగా సబ్సిడీ ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.
కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ.20 వేల అదనపు సబ్సిడీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం కలిగిన బీసీ వినియోగదారులకు ఈ అదనపు సబ్సిడీ ఇస్తారు. రూ.5,445 కోట్ల అంచానా బడ్జెట్ తో పీఎం సూర్యఘర్ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. (PM Surya Ghar Scheme)
విద్యుత్ చార్జీలను రూ.5.12 నుంచి రూ.4కు తీసుకురావాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. దీనికోసం రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం పలు సంస్థల ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించింది.
ఇటీవల ఎస్‌ఐపీబీ సమావేశంలో తీసుకున్న పలు పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 సంస్థలకు సంబంధించి రూ.20,267 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
క్వాంటం కంప్యూటింగ్‌లో పెట్టుబడులకు ఆమోదం
దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గంలో ఆమోదముద్ర పడింది. క్వాంటం కంప్యూటింగ్ లో రూ.1,421 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 3,057 మందికి క్వాంటం అప్లికేషన్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
క్వాంటం కంప్యూటింగ్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన 11 సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటర్లు తయారు చేయడం కోసం ముందుకు వచ్చిన పలు సంస్థల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది
