రాజధాని రగడ..19వ రోజు : రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు

* కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు
* 19వ రోజుకు చేరిన అన్నదాతల నిరసనలు
* ఆందోళనలను ఉధృతం చేస్తున్న రైతులు
* రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలకు పిలుపు
ఏపీ రాజధాని రైతుల ఆందోళన 19వ రోజుకు చేరింది. 2020, జనవరి 04వ తేదీ శనివారం అమరావతి ప్రాంతంలో బంద్ పాటించిన అన్నదాతలు.. 2020, జనవరి 05వ తేదీ ఆదివారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయబోతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై రగిలిపోతున్న రాజధాని రైతులు… ఆందోళనలను నిన్నటివరకు అమరావతికి మాత్రమే పరిమితం చేశారు. దానిని ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేయనున్నారు. ఆందోళనలో భాగంగా రాష్ట్రం మొత్తం ర్యాలీలతో హోరెత్తించాలని పిలుపునిచ్చారు.
రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి సిద్ధమైంది.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు ఉద్యమానికి సహకరించాలని సమితి సభ్యులు కోరారు. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు తమ ఆందోళనలు విరమించేది లేదని వారు తెగేసి చెబుతున్నారు. 19 రోజులుగా అమరావతి రైతులు రోడ్లపైకి వచ్చి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందిచడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు … అమరావతి ప్రాంతంలో రైతుల మహా ధర్నాలు, నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలోను నిరసనలు తెలపనున్నారు. తూళ్లూరులో మహా ధర్నాతో పాటు.. వంటా వార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు.