ఏపీ రాజధాని తేలేది రేపే

ఏపీ రాజధాని భవిష్యత్ తేలిపోనుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సీఎం జగన్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టనుంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాజధాని అంశాన్ని సభలో ప్రవేశ పెట్టి..చర్చించనుంది. పరిపాలన రాజధాని విశాఖపట్టణం, రాష్ట్రంలో మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టంలో మార్పులు లాంటి..కీలక నిర్ణయాలకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది.
అయితే వీటిని టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఉదయం 11గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా..2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం కూడా జరుగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకొంటారు.
రాజధాని రైతులు, రైతు కూలీలకు మేలు చేసేలా చర్యలు తీసుకొనే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ మీటింగ్ అనంతరం ఉదయం 10గంటలకు బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ రోజులు జరపాలని టీడీపీ పట్టుబడనుంది. రాజధాని రగడపై పాలనపై ఫోకస్ చేయలేకపోతోంది.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పరిష్కరించలేకపోతోంది. త్వరగా రాజధాని మార్పుకు చెక్ పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. శాసనమండలిలో, శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు చేసే దాడిని పక్కాగా ఎదుర్కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాజధానిలో రగడ కొనసాగుతోంది. చలో అసెంబ్లీ, చలో కలెక్టర్‌ట్‌కు పిలుపునిచ్చారు. ఎవరైనా నిరసనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముందస్తుగా రైతులకు నోటీసులు ఇస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లే దారుల్లో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఉద్యమకారులను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జరిగే అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.
Read More : ఒకటి కాదు మూడు : రాజధానిపై అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు