ఇవాళ అసెంబ్లీకి రాలేని, మీ ముందు కూర్చోలేని పరిస్థితి వచ్చింది- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

అహంకారంతో వ్యవహరిస్తే ఇలానే జరుగుతుంది.

ఇవాళ అసెంబ్లీకి రాలేని, మీ ముందు కూర్చోలేని పరిస్థితి వచ్చింది- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

Updated On : November 15, 2024 / 1:37 AM IST

Cm Chandrababu Naidu : సొంత ఎంపీపైనే దాడి చేయించిన ఘనత మాజీ సీఎం జగన్ కే చెందుతుందన్నారు సీఎం చంద్రబాబు. జైల్లో రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానివ్వని వారు, ఇవాళ మీ ముందుకు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

”నేనే జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలనే ప్రయత్నం చేశారు. రఘురామకృష్ణరాజు విషయంలోనూ అదే జరిగింది. ఆయనను కొడుతూ సెల్ ఫోన్ లో జగన్ చూశారని చెప్పే పరిస్థితి. ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ, నా విషయంలో అది నమ్మాల్సి వచ్చింది. జైల్లో నన్ను పెట్టిన రూమ్ లోనూ సీసీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు జగన్ మెంటాలిటీ తెలిసింది.

అది జరిగిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను. ఎక్కడున్నా ఇలాంటి వాళ్లు ఉన్నారా అని. అప్పుడు ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో కనిపించాడు. 1980-85 ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎస్కోబార్. అతడికి ఇతడికి పోలికలు సరిగ్గా సరిపోతున్నాయి. మాదక ద్రవ్యాల ముఠాలకు నాయకుడు ఎస్కోబార్. అత్యంత ధనికుడిగా, నేరస్తుడిగా, దుర్మార్గుడిగా ఎమర్జ్ అయ్యాడు.

వై నాట్ 175 అని నాడు జగన్ అంటే… నీకు ఇచ్చేది 11 సీట్లే అని నేను చెప్పా. అలాగే గెలిపించారు. ఇంకోపక్క నీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు వారికి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు. అహంకారంతో వ్యవహరిస్తే ఇలానే జరుగుతుంది. రఘురామను నాడు రాష్ట్రానికే రానివ్వని వారు..నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్” అని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అన్నారు.

 

Also Read : నిన్న ఆర్జీవీ.. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి.. అరెస్టుల పర్వంలో నెక్ట్స్‌ జరగబోయేదేంటి?