Rahul Gandhi : రాహుల్‌తో ఏపీ లీడర్స్ భేటీ.. త్వరలో అమరావతికి ప్రియాంక
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి రాహుల్ గాంధీ దృష్టికి ఏపీ కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏఐసీసీ స్థాయిలో పోరాటం చేయాలని రాహుల్‌కు వినతిపత్రం అందజేశారు.

Rahul Gandhi
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధానిలేని రాష్ట్రంగా మిగిలిపోవటం బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగి హెలికాప్టర్ ద్వారా ఖమ్మం సభా ప్రాంగణం వద్దకు రాహుల్ చేరుకున్నారు. బహిరంగ సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా 10.30గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, కొలనుకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహారావు తదితరులు రాహుల్ ను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ వారితో సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించారు.
విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా తదితర అంశాల్లో ఏపీకి అన్యాయం జరుగుతోందని రాహుల్ దృష్టికి ఏపీ కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు. ముఖ్యంగా ఏపీ రాజధానికోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులను ప్రభుత్వం వేదనకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్పగా.. అన్ని విషయాలు తన దృష్టిలో ఉన్నాయని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్కటి నెరవేర్చేలా కృషిచేద్దామని రాహుల్ చెప్పినట్లు ఏపీ కాంగ్రెస్ నేతలు తెలిపారు. గతంలో చెప్పిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించినట్లు తెలిసింది. ఏపీ రాజధాని అమరావతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, త్వరలో అమరావతి ప్రాంతంలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని రాహుల్ చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
Ponguleti Srinivas Reddy: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి, పలువురు నేతలు
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి రాహుల్ గాంధీ దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏఐసీసీ స్థాయిలో పోరాటం చేయాలని ఆనయకు వినతిపత్రం అందజేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా విశాఖ పర్యటనకు రావాలని కోరారు. ఇందుకు రాహుల్ సమ్మతించి జూలై, ఆగస్టు నెలల్లో విశాఖకు వస్తానని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదామని రాహుల్ చెప్పారు. ఇదిలాఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను బూచిగా చూపించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డిని బాగానే వాడుకుంటోందని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.