Pawan Kalyan : ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ తో పుస్తకాలు కొన్నా- పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పుస్తకం ద్వారా వచ్చే శక్తి, జ్ఞానం వేరు. చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది.

Pawan Kalyan : జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పుస్తకాలను నా సంపదగా భావిస్తానని ఆయన అన్నారు. నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తాను అని చెప్పారాయన. నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయే వాడినో అని పవన్ అన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నన్ను నిలబడేలా చేశాయని పవన్ కల్యాణ్ అన్నారు.
”చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా. పుస్తకాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం. తెలుగు సరిగా నేర్చుకోనందుకు ఈరోజు నేను బాధపడుతున్నా. స్కూల్ లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుందనడం సరికాదు. ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృ భాష చాలా ముఖ్యం.
Also Read : త్వరలో ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న ఎమ్మెల్సీలు ఎవరెవరు?
తెలుగు వ్యక్తిగా దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం పరిచిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు. ఢిల్లీలో పీవీ నరసింహారావు ఖననం సరిగా జరగలేదు. ఆయన సమాధికి స్థలం లేదు ఆయన స్మృతి వనం ఏర్పాటుకు కృషి చెయ్యాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ స్పీచ్ సమయంలో OG అంటూ అభిమానులు నినాదాలు చేయగా.. పవన్ కల్యాణ్ స్పందించారు. OG కంటే శ్రీ శ్రీ అనండి.. అని ఫ్యాన్స్ తో చెప్పారాయన. ‘నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాల ప్రభావమే. యూత్ అంతా పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. పుస్తకం ద్వారా వచ్చే శక్తి, జ్ఞానం వేరు. చీకటిలో ఉన్నప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుంది.
నేను బయటికి వచ్చినా పుస్తకాలు నా పక్కనే ఉండాలి. చేతిలో పుస్తకం ఉంటే ఆ ధైర్యమే వేరు. తొలి ప్రేమ సినిమా ద్వారా వచ్చిన 15 లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొన్నా. కొన్నవన్నీ రూమ్ లో వేసుకుని మూడు రోజులు చదివేశా. మన జీవితకాలంలో అందరూ 10వేల పుస్తకాలు చదవాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పుస్తక మహోత్సవంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
Also Read : నాడు ఓ వెలుగు వెలిగారు, నేడు పుట్టెడు కష్టాలు..! ఆ ముగ్గురు నానీల పరిస్థితి ఇలా ఎందుకైంది?