Bhimavaram DSP Jayasurya: భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు.. నాడు పవన్ కల్యాణ్ సీరియస్..
తాజాగా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Bhimavaram DSP Jayasurya: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా.. జయసూర్యను బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. గతంలో DSP జయసూర్యపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయన పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారని, వాటిపై విచారణ చేయాలని అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ డీజీపీకి లేఖ రాశారు. అయితే జయసూర్య మంచి అధికారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణరాజు అప్పట్లో కితాబివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది.
భీమవరం డీఎస్పీపై ఆకస్మిక బదిలీ వేటు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. పేకాట శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్నారని అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా డీజీపీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇవ్వడం, డీఎస్పీ జయసూర్యకు మద్దతు తెలపడం కూటమిలో కొంత దుమారం రేపింది. కూటమి నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయనే ప్రచారం నడిచింది. తనకున్న సమాచారం ప్రకారం జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని రఘురామ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారని, అందుకే డీఎస్పీ పైన అభియోగాలు వస్తున్నట్లు భావిస్తున్నానని వెల్లడించారు. చివరికి శాఖాపరమైన విచారణ తర్వాత.. జయసూర్యను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
భీమవరం డీఎస్పీ జయసూర్యపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. భీమవరం నియోజకవర్గంలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, వాటి నిర్వహణకు ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని.. నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని, కూటమి నేతల పేరు వాడుకుంటున్నారని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు ఆస్తి తగాదాలు, ప్రైవేటు సెటిల్ మెంట్లలో డీఎస్పీ జయసూర్య తలదూరుస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన పవన్ కల్యాణ్.. స్వయంగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు.
డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి సూచించారు. ఆయన వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని పవన్ కోరారు. ఆ తర్వాత జయసూర్య వ్యవహారంపై డీజీపీకి కూడా లేఖ రాశారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేసిన డీజీపీ.. తాజాగా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Also Read: ఏపీలో వారందరికీ శుభవార్త.. రూ.33వేలు ఇక కట్టాల్సిన పనిలేదు.. ప్రభుత్వం ఆదేశాలు జారీ..
