AP Govt: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో ‘ఏపీ డ్రోన్ మార్ట్’ పేరుతో పోర్టల్..
డ్రోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

AP Drone Corporation
AP Govt: డ్రోన్ల తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ప్రపంచ స్థాయి డ్రోన్లను అభివృద్ధి చేయడం, ప్రపంచ డ్రోన్ ఇండస్ట్రీలో కీలకంగా మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ రంగంలోని పెట్టుబడిదారులు, వ్యాపారులు, ప్రజలను అనుసంధానం చేసేందుకు ‘ఏపీ డ్రోన్ మార్ట్’ పేరుతో ఓ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వేగంగా అడుగులు వేస్తోంది. పరిపాలనలో, ప్రజలకు డ్రోన్ల సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కార్పొరేషన్ కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ డ్రోన్ మార్ట్ పేరిట ఓ పోర్టల్ ను డ్రోన్ కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకురానుంది. గుర్తించిన సంస్థలు అందించే డ్రోన్ సేవల వివరాలను ఈ పోర్టల్ లో ఉంచుతారు.
పోర్టల్ లోని ఎంప్యానల్ జాబితాలో చేరేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి డ్రోన్ కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. డ్రోన్ల తయారీ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తగిన ప్రతిపాదనలతో రావాలని సంస్థ కోరింది. డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు, ఔత్సాహికులు యూజ్ కేసుల ప్రతిపాదనలను ఈ నెల 21లోగా ఆన్ లైన్ ద్వారా పంపాలని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కోరింది.
కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు డ్రోన్ కార్పొరేషన్ తెలిపింది. డ్రోన్లు, పరికరాల తయారీ, టెస్టింగ్, కోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ రంగంలో పెట్టుబడులకు దేశంలోనే అత్యుత్తమ ప్రాంతంగా ఓర్వకల్లును తీర్చిదిద్దుతామని కార్పొరేషన్ పేర్కొంది.