Rayalaseema Lift : రేవంత్ చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఆపలేదు.. అసలు జరిగిందిదే అంటున్న ఏపీ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధిపొందే ప్రయత్నాన్ని తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు చేస్తున్నాయి.. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం రాజీ పడదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Revanth Reddy
- తన విన్నపం మేరకు చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారన్న సీఎం రేవంత్
- రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఏపీ ప్రభుత్వం
- 2020లోనే కేంద్రం, ఎన్జీటీ పనుల నిలిపివేతకు ఆదేశాలిచ్చాయని వెల్లడి
- వాస్తవాలు బయటపెట్టేందుకు సిద్ధమైన ఏపీ సర్కార్
Rayalaseema Lift : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుబడుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందని అన్నారు. ప్రస్తుతం రేవంత్ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారని రేవంత్ అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుబడుతుంది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్దమని ఏపీ సర్కార్ పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం వాదన ఇది..
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నాటి ప్రభుత్వం చేపట్టింది. సీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా పనులను జగన్ ప్రభుత్వం చేపట్టింది. నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు స్థాయిల్లో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులతో విచారించి.. అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేశారు. 2020లోనే ఈ మేరకు ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2024లో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపివేసింది.
చంద్రబాబు నాయుడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధిపొందే ప్రయత్నాన్ని తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు చేస్తున్నాయని, ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం రాజీ పడదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో వాస్తవాలు బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ఈ మేరకు మీడియా సమావేశం పెట్టి ఆధారాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
