PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి టూర్.. జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం..
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ..

Jagan Mohan Reddy
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.25గంటలకు ప్రధాని సచివాలయం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభిస్తారు. రాజధాని ప్రాజెక్టులతోపాటు పెద్దెత్తున కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అమరావతిలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి పనుల పున:ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం పంపించింది. ప్రధాని చేతులు మీదుగా జరిగే కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రభుత్వం ఆహ్వానం అందించింది. తాడేపల్లి నివాసంలో జగన్ పీఎస్ కు అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. 2015లో నాటి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా జగన్ కు నాటి ప్రభుత్వం ఆహ్వానం పలికింది. అయితే, అమరావతి పనుల పున:ప్రారంభంలో జగన్ హాజరు కావాలని కోరుంటున్నామని పలువురు మంత్రులు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో చేపట్టే రూ. 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రాజెక్టుల్లో భాగంగా డీఆర్డీఓ, డీపీఐఐటీ, రైల్వేస్, NHAIకు సంబంధించిన రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నుంచి వర్చుల్ పద్దతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో యూనిటీ మాల్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన యూనిటీ మాల్ ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు.
రూ. 172కోట్లతో జీప్లస్4 అంతస్తులతో దీన్ని నిర్మిస్తారు. తొలి విడతగా కేంద్రం రూ.86కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే2న ప్రధాని నరేంద్ర మోదీ యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు.