AP Budget : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.. ఆ పథకాలకు నిధులు కేటాయింపు..!
విపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, విమర్శలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేశారని..

AP Budget : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అటు బడ్జెట్ ఆమోదం కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దాదాపు 3 లక్షల 20వేల కోట్ల రూపాయలతో రూపొందించిన పూర్తి స్థాయి బడ్జెట్ ని ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. అంతకన్నా ముందు క్యాబినెట్ సమావేశం ఉంటుంది. అందులో బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి. ఆ తర్వాత సభలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన అంశాలను బడ్జెట్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పూర్తి స్థాయి కార్యాచరణ ఇందులో ప్రవేశపెడతారు. ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు పెండింగ్ లో ఉన్న స్కీమ్స్.. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం.. వీటికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తైనట్లు సమాచారం. విపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, విమర్శలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేశారని, నిధులు కేటాయించారని, పూర్తిస్థాయిలో ప్రజారంజకంగా బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది.
అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులు ఎలా సమకూరుతాయి, పోలవరం ప్రాజెక్ట్ ను సకాలంలో పూర్తి చేయడానికి ఎలాంటి కార్యాచరణ ఉంది, ఎంత మేరకు నిధులు కేటాయించారు.. ఈ అంశాలకు సంబంధించి ఏపీ బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుండటం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కూడికలు తీసివేతలు, ఆదాయం ఖర్చు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత 3 లక్షల 20వేల కోట్ల రూపాయలతో రూపొందిన బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అన్ని శాఖలు, వర్గాలు, నియోజవర్గాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు సమాచారం.