మద్యం షాపులు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించబోతున్నారు.

మద్యం షాపులు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ap New Liquor Policy (Photo Credit : Google)

Updated On : September 27, 2024 / 4:43 PM IST

AP New Liquor Policy : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాపులను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాలను రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది కూటమి సర్కార్. అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించింది గత వైసీపీ సర్కార్. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది.

Also Read : బొత్స సత్యనారాయణకు తమ్ముడు బిగ్ షాక్..! జనసేనలో చేరేందుకు రెడీ?

అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీని అమలు చేయబోతోంది ఏపీ సర్కార్. కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టేందుకు ఇటీవల సమావేశమైన ఏపీ మంత్రివర్గం దానికి ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 18 వరకు టీడీపీ హయాంలో అమలైన పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించబోతున్నారు.

రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందాయి. త్వరలోనే కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. గత ప్రభుత్వం హయాంలో మొత్తం మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నిర్వహించింది. ఆ చట్టాన్ని సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ సైతం చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది.

ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ విడుదలైంది. రాష్ట్రం మొత్తం మీద 3వేల 736 వైన్ షాపులు నిర్వహించబోతున్నారు. వీటిలో 340 వైన్ షాపులను కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేస్తారు. ప్రతి వ్యక్తి కూడా ఎన్ని షాపులైనా ఓపెన్ టెండర్ ద్వారా పాడుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లైసెన్స్ ఫీజులు కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.

10వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒక్కో షాపుకి 50 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా 50వేల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 65 లక్షల రూపాయలు, 5 లక్షలకు పైగా జనాభా ఉంటే 85 లక్షల రూపాయలు చొప్పున లైసెన్స్ ఫీజు కట్టాలని ప్రభుత్వం నిర్ధారించింది. కొత్త మద్యం విధానం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. షాపులకు సంబంధించి ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు విడతలుగా ఫీజును చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది.

రెండేళ్ల తర్వాత లైసెన్స్ రుసుం మరో 10శాతం పెంచే అవకాశం ఉంది. కొత్త మద్యం విధానానికి సంబంధించి నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త మద్యం విధానం అక్టోబర్ మొదటి వారం నుంచి అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే నాణ్యమైన బ్రాండ్లన్నీ ఏపీకి దిగుమతి అవుతున్న పరిస్థితి ఉంది.