క్యూఆర్ కోడ్‌తో రాజముద్రతో ఉచితంగా డిజిటల్ పాస్ బుక్స్: ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్
"గత ప్రభుత్వ పాలనలో ఫొటోల పిచ్చితో పట్టాదారు పాసుపుస్తకాలపై వారి ఫొటోలు వేసుకున్నారు" అని అన్నారు.

Anagani Satyaprasad
రెవెన్యూ శాఖపై అమరావతిలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సమీక్ష గురించి వివరాలు తెలిపారు.
“రాష్ట్రంలో అన్ రెగ్యులరైజ్డ్ భూములు ఉండటానికి వీలులేదని సీఎం ఆదేశించారు. అసైన్ భూములు వ్యవహారంపై దృష్టిపెట్టాం. గత పాలకులు భూ భక్షకులు.. పేదల భూములు భారీగా దోచుకున్నారు. మేం భూ యజమాలకు లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నాం.
గత ప్రభుత్వ పాలనలో ఫొటోల పిచ్చితో పట్టాదారు పాసుపుస్తకాలపై వారి ఫొటోలు వేసుకున్నారు. ఆగస్టు 15 నాటికి మేం క్యూ ఆర్ కోడ్ తో రాజముద్రతో కూడిన డిజిటల్ పాస్ పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నాం. భూముల పాస్ పుస్తకానికి – బ్యాంక్ లోన్ కు సంబంధంలేదు. ప్రొటోకాల్ కు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నాం. ఏ శాఖ చెందిన వారు వస్తే ఆ శాఖ వారే ప్రొటోకాల్ చూసుకోవాలి.
ఇకపై భూముల అంశంలో సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ కలిపి బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో అక్రమాలకు పాల్పడితే.. వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
ఏడాది పాలనలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. 10 అంశాలకు సంబంధించి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదవాడికి భూ హక్కులు కల్పించే విధంగా, నివాస యోగ్యంగా ఇంటి స్థలం ఇస్తాం. 363 గ్రామాలలో స్మశానాల కోసం 137 కోట్లు నిధుల విడుదల చేస్తాం. రెవిన్యూ శాఖలో లక్షా 85 వేల ఫిర్యాదులు అందాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నంబర్లపై పూర్తి సమాచారం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తున్నాం” అని అన్నారు.