జగన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి, సమాజంలో తిరిగే అర్హత లేదు- హోంమంత్రి అనిత ఫైర్

క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజలు కోసం ఆలోచించరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

జగన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి, సమాజంలో తిరిగే అర్హత లేదు- హోంమంత్రి అనిత ఫైర్

Home Minister Anitha : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. జగన్ కు ఈ సమాజంలో తిరిగే అర్హత లేదన్నారు. ఓవైపు ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

గత పది రోజులుగా వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని హోంమంత్రి అనిత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే బస ఏర్పాటు చేసుకున్నారని, సహాయక చర్యలను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ప్రతీ వార్డుకు ఒక ఐఏఎస్ అధికారిని కేటాయించామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారని మంత్రి వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండుసార్లు బయటికి వచ్చి ప్రభుత్వం మీద బురద జల్లి వెళ్ళిపోయారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ వల్ల లక్షల మందికి సాగు నీరు, తాగు నీరు అందుతుందన్నారు. అలాంటి ప్రకాశం బ్యారేజ్ వద్దకు బోట్లు వచ్చేలా చేశారని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధ్వంసం చేయడానికి వచ్చారని ఆరోపించారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు.

”మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ చేశారు. మూడు బోట్లను నైలాన్ తాడుతో కట్టారు. లంగరు కూడా వేయకుండా చిన్న తాడుతో ఎందుకు కట్టారు? కొన్ని వేల మంది ప్రాణాలను గాల్లో కలిసిపోయేవి. బోట్లుకు వైఎస్ఆర్ సీపీ రంగులు ఉన్నాయి. వైసీపీ రంగులు వేసుకుని ఇసుక వ్యాపారం చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే బోటు ఓనర్లు. తమ బోట్లు పోయాయని ఈరోజు వరకు ఫిర్యాదు కూడా చెయ్యలేదు. క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజలు కోసం ఆలోచించరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జగన్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి. సమాజంలో తిరిగే అర్హత జగన్ కి లేదు” అని నిప్పులు చెరిగారు హోంమంత్రి అనిత.

Also Read : దేవినేని అవినాశ్‌ టీడీపీకి శాశ్వత శత్రువుగా ఎందుకు మారారు? అసలేం జరిగింది..

ఎంత ఖర్చు అయినా పర్లేదు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం భావించింది. వెంటనే కౌంటర్ వెయిట్లను రీస్టోర్ చేశాం. రాత్రి, పగలు పని చేశారు. వరద ప్రవాహం పెరిగితే పరిస్థితి ఏంటి అని మేమంతా ఆందోళనలో ఉంటే.. వైఎస్ జగన్ బయటకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీని డ్యామేజీ చేయాలని కుట్ర చేశారు. అంత బరువున్న బోట్లను ఎందుకు వదిలారు? ఇవాళ్టి వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ, బోట్లు పోయాయి అని కానీ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. డిపార్ట్ మెంట్ ఇన్వెస్టిగేషన్ లో బోట్లు పలానా వ్యక్తులవి అని తెలిసింది తప్ప బోట్ల యజమానులు ఎవరూ బయటకు రాలేదు. ఆ బోట్లు మావి అని చెప్పలేదు. బోట్లు ఢీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. అంటే ఎంతటి విధ్వంసం చేయడానికి పూనుకున్నారో, వారి నైజం ఎలాంటిదో ప్రజలు ఆలోచన చేయాలి.

ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం తన వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా, 11 సీట్లే ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పటికీ కుట్రలు, కుతంత్రాలు మానలేదు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజీని కూడా డ్యామేజ్ చేయాలి అన్న ఆలోచన రావడమే పెద్ద క్రైమ్. అటు వంటి వ్యక్తులపై మరీ ముఖ్యంగా జగన్ పై దేశద్రోహం కేసు పెట్టాలి. బోట్ల యజమానులపైన కూడా దేశద్రోహం కేసులు పెట్టాలి” అని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు.