ఏపీలో నవశకం : ఇంటింటి సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో నవశకం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ నవశకం పేరిట అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు ఈ కార్యక్రమం 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇంటింటి సర్వే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, పట్టణ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లతో పాటు మండల స్థాయి అధికారులందరూ కలిపి దాదాపు 4 లక్షల మంది ఇంటింటి సర్వేలో భాగస్వాములు కానున్నారు.
ఏపీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కోసం ప్రజలు జన్మభూమి కార్యక్రమాల్లో దరఖాస్తులు చేసుకునే వారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రజల దగ్గరికే అధికారులు వెళ్లనున్నారు. లబ్దిదారులను నేరుగా గుర్తించనున్నారు. సన్న బియ్యం, వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమాల్లో కార్డులను ప్రత్యేకంగా అందజేసేందుకు వాలంటీర్లు సర్వే చేస్తారు. అలాగే వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న భరోసా, గీతన్న నేస్తం, అమ్మఒడి, వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకంలో అర్హుల ఎంపిక, అనర్హుల పేర్లను నివేదికగా వాలంటీర్లు అందజేస్తారు.
> డిసెంబరు 1న డేటాను కంప్యూటరీకరిస్తారు.
> అర్హులతో పాటు అనర్హుల జాబితాను డిసెంబరు 2 నుంచి 7వ తేదీల్లో ప్రకటిస్తారు.
> 11, 12 తేదీల్లో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు.
> 15 – 18 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి 19న ఫైనల్ లిస్ట్‌ని ప్రకటిస్తారు.