AP municipal Election 2021 : తాడిపత్రిలో క్యాంపు రాజకీయాలు, గెలిచిన అభ్యర్థులను ఊటికి తరలిస్తున్న టీడీపీ
తాడిపత్రిలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన టీడీపీ అభ్యర్థులు ఎక్కడ చేజారుతారని టీడీపీ ఆందోళన చెందుతోంది.

Tadipatri Tdp
Tadipatri : తాడిపత్రిలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన టీడీపీ అభ్యర్థులు ఎక్కడ చేజారుతారని టీడీపీ ఆందోళన చెందుతోంది. దీంతో వారిని ఎక్కడికైనా తరలించాలని భావించారు. గెలిచిన వారిని ఊటీకి తరలిస్తున్నారు జేసీ వర్గీయులు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వరకు అక్కడనే ఉంచాలని కీలక నేతలు భావిస్తున్నారు. తాడిపత్రి మున్సిపాల్టీలో మొత్తం 36 వార్డులున్నాయి. 18 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 16 చోట్ల వైసీపీ గెలిచింది. ఒక చోట సీపీఐ, మరొకచోట ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. తమ పార్టీకి చెందిన అభ్యర్థులు చేజారిపోకుండా టీడీపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది.
తాడిపత్రిలో టీడీపీ విజయంపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓట్లకోసం అధికారపార్టీ డబ్బులు, చీరలు పంచినా… ప్రజలు మాత్రం తమకే మద్దతు తెలిపారన్నారు. ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు నమ్మారని.. అందుకే ఓట్లేసి గెలిపించారన్నారు. తాడిపత్రిలో ప్రజలదే విజయమన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. సేవ్ తాడిపత్రి నినాదంతో ప్రజలను ఓట్లడిగామని.. అదే తమను కాపాడిందని స్పష్టం చేశారు. పది రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తానని తెలిపారు.