ఏపీలో రాజ్యసభ ఎన్నికలు.. పెద్దల సభకు వెళ్లే ఆ అదృష్టవంతులు ఎవరంటే?
జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్‌కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. మూడు పార్టీలు..ఎందరో ఆశావహులు. ఎవరి లెక్కలు వారివి. ఒక్కొక్కరిది ఒక్కో ఈక్వేషన్. కానీ టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది మాత్రం ఒక్కరే అంటున్నారు. ఆ సీటు ఖాళీ అయ్యేందుకు కూడా ఇంకా ఆరు నెలల టైమ్ ఉంది. అయినా ఇప్పటినుంచే ఓ రేంజ్‌లో లాబీయింగ్ స్పీడప్ చేశారట లీడర్లు. పెద్దల సభకు వెళ్లేందుకు..టీడీపీ నుంచే ఆరేడుమంది గట్టి ప్రయత్నం చేస్తున్నారట. అటు జనసేన, బీజేపీలో కూడా కాంపిటీషన్ గట్టిగానే ఉందంటున్నారు. రాజ్యసభ సీటు దక్కేది ఎవరికి..? పెద్దల సభకు వెళ్లే ఆ అదృష్టవంతుడెవరు.? బాబు మదిలో ఏముంది.? ఆశావహుల అంచనాలేంటి.?
కూటమిలో రాజ్యసభ రేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంకో ఆరు నెలల తర్వాతే ఏపీలో రాజ్యసభ సీట్లు కానున్నాయి. అయినా ఇప్పటినుంచే ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. టీడీపీలో అయితే పైరవీల పర్వం నెక్స్ట్ లెవల్‌లో నడుస్తోంది. ఏపీలో వచ్చే ఏడాది మే-జూన్ మధ్య జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికలపై అప్పుడే వేడి మొదలైంది. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ నాలుగు సీట్లను టీడీపీ, కూటమి పార్టీలే గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ నుంచి 11 మంది నేతలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు టీడీపీ, ఇద్దరు బీజేపీ కాగా, మిగిలిన ఏడుగురు ప్రతిపక్షం వైసీపీ సభ్యులు. వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్న సభ్యుల్లో ముగ్గురు వైసీపీ, ఒక టీడీపీ సభ్యుడు ఉన్నారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని పదవీ కాలం 2026 జూన్ 21తో పూర్తి కానుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ తరఫున గెలిచిన సానా సతీష్ పదవీకాలం కూడా జూన్‌లోనే ముగుస్తుంది.
కూటమిలో పలువురు నేతలు ఇప్పటినుంచే రాజ్యసభ రేసును మొదలుపెట్టారట. మూడు పార్టీలు..నాలుగు సీట్లను ఎలా పంచుకుంటాయనే చర్చ ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తొలుత మూడు స్థానాలకు, ఆ తర్వాత ఒక స్థానానికి ఎన్నిక జరిగితే టీడీపీ, బీజేపీ చెరో రెండు సీట్లు తీసుకున్నాయి. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పటివరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు ఓ సీటు కేటాయిస్తారని అంటున్నారు. ఇక మూడు సీట్లు మిగిలితే అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇంకో రెండు సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రెండింట్లో గతేడాది ఎన్నికైన సానా సతీష్ ఏడాదిన్నరలోనే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయనకు మళ్లీ రెన్యూవల్ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీకి కొత్తగా దక్కేది ఒక్క సీటేనన్న అంచనాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన గల్లా జయదేవ్, పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహార్‌తో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీ జనార్ధన్ రాజ్యసభ బెర్తును ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. టీడీ జనార్ధన్ టీడీపీలో చంద్రబాబుకు రాజకీయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. పార్టీలో ఏ క్రైసెస్ వచ్చినా తానున్నానంటూ పరిష్కరిస్తూ అధినేతకు చేదోడువాదోడుగా ఉంటున్నారనే గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో అనేక వర్గాలను సమీకరించి పార్టీకి అనుకూలంగా పనిచేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న పేరుంది. ఇక కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని పార్టీలను కోఆర్డినేట్ చేయడంలో కీరోల్ ప్లే చేయడంతో పాటు..టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరటంలో ఆయన ప్రయత్నం కూడా ఉందంటున్నారు. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. 2019 ఓటమి తర్వాత ఎంపీలంతా బీజేపీలో చేరినప్పటికీ తానొక్కడినే రాజ్యసభలో టీడీపీ తరఫున ఒంటరి పోరాటం చేశానంటున్నారు. దేవినేని ఉమాకి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. విధేయుల కోటాలో ఆయన తన పేరును పరిశీలించాలని కోరుతున్నారట. ఎస్సీ కోటాలో వర్ల రామయ్య రాజ్యసభ సీటు కోసం భారీ ఆశలు పెట్టుకున్నారు. 20ఏళ్లుగా వైఎస్ కుటుంబంపై తాను చేస్తున్న పోరాటాలను గుర్తు చేస్తున్నారాయన. ఇక రాయలసీమ నుంచి రెడ్డి కోటలో పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పెద్దల సభ సీటు రేసులో ఉన్నారు. జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్‌కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి జాతీయ నాయకులను ఎవరినైనా రంగంలో దించే అవకాశం ఉందట. కమ్మ, ఎస్సీ, బీసీ, రెడ్డి వర్గాల నుంచి ఆరేడుమంది రాజ్యసభ సీటు ఆశిస్తుండగా..టీడీపీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
