APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శుభవార్త.. ఈ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
మహిళలు ఈ బస్సుల్లో టికెట్ లేకుండానే ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
Ap Rtc Representative Image (Image Credit To Original Source)
- మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
- స్పెషల్ బస్సుల్లో టికెట్ల ధరలు ఖరారు
- ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
APSRTC: ఏపీలోని కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలు ఉచితంగానే ప్రయాణం చేస్తున్నారు. తాజాగా మహిళలకు ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు నడపనున్న ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చంది.
ఈ నెల 15న మహాశివరాత్రి. భక్తులు శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేసింది. శివరాత్రి స్పెషల్ సర్వీసులకు కూడా స్త్రీ శక్తి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లకు వెళ్లే భక్తుల కోసం 618 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా 2వేల మంది సిబ్బందిని నియమించారు. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, చీరాల డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. అంతేకాదు పెట్లూరివారిపాలెం దగ్గర ప్రత్యేకంగా ఆర్టీసీ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇక ఈ స్పెషల్ సర్వీసుల్లో టికెట్ రేట్ల గురించి వివరాలు తెలిపారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండకు 30 రూపాయలు, కొండ దిగువ నుంచి పైకి 25 రూపాయలుగా ఛార్జీ నిర్ణయించారు. మహిళలు మాత్రం ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు.
