ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య మరో వివాదం.. వాచ్ యాప్‌పై అభ్యంతరం

ap sec vs jagan government over watch app: ఏపీలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ని పెంచాయి. పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య రగడకు దారితీసింది. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య వరుసగా వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. సై అంటే సై అంటూ పొలిటికల్ హీట్ ని పెంచారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.
ఎస్ఈసీ, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా మరో వివాదం తలెత్తింది. అదే వాచ్ యాప్. కాసేపట్లో వాచ్ యాప్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభించనున్నారు. కాగా, వాచ్ యాప్ ఆవిష్కరణపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ యాప్ ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. తమను సంప్రదించకుండానే యాప్ రూపొందించడంపై ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం.. ఎస్ఈసీ నిమ్మగడ్డపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా సమాచారం. యాప్ పై యాక్షన్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతోంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొని ఉంది.
పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొస్తున్న యాప్.. ఇప్పుడు.. ఎస్‌ఈసీ, అధికార వైసీపీ మధ్య మరో చిచ్చు పెట్టింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమయంలో ఫిర్యాదులు, ఇతర అంశాల కోసం ఎస్‌ఈసీ ఈ యాప్ తెస్తున్నామని ప్రకటించింది. ఇప్పటికే ఈ యాప్ రూపుదిద్దుకోగా.. ఆవిష్కరణకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అయ్యారు.
అయితే, ఎస్ఈసీ తీసుకొస్తున్న యాప్ పై తమకు అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ అభ్యంతరాలు ఎస్ఈసీకి చెప్పామన్నారు. నిమ్మగడ్డ వ్యవహారశైలి మాత్రం భిన్నంగా ఉందంటున్నారు. యాప్ లో పారదర్శకత లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు.. ఈ యాప్ తయారీ మొత్తం టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తోంది. ఒకవేళ యాప్ ఉపయోగించాలి అనుకుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సీ విజిల్ ని ఉపయోగించాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.
ఇలాంటి యాప్ లు తీసుకొచ్చే ముందు లేదా ఏదైనా యాక్షన్ తీసుకొనే ముందు కచ్చితంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి యాప్ ల తయారీ ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆధీనంలో జరగాలని తేల్చి చెబుతున్నారు. అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా యాప్ ని రూపొందించారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి.
మేం కూడా ఒక యాప్ తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మా వ్యవస్థను మేం ఏర్పాటు చేసుకున్నాం అన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను అప్రమత్తం చేశామన్నారు. క్షేత్ర స్థాయి సమాచారం కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరుతుందన్నారు. పార్టీ కార్యాలయం నుంచే నేరుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల సమయంలో యాప్‌ల పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.