Sleeper Bus Ban : స్లీపర్ బస్సులను రద్దు చేస్తాం.. వాటిపై టాక్సేషన్ తగ్గిస్తాం : రవాణా శాఖ మంత్రి
Sleeper Bus : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఏపీలో స్పీపర్ బస్సులు బ్యాన్ చేస్తామని ప్రకటించారు.
ap transport minister mandipalli ramprasad reddy said will think about ban on sleeper buses
- బస్సుల్లో ప్రమాదాల నివారణపై ఏపీలో సమీక్షా సమావేశం
- ఏపీ మినిస్టర్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- అవసరమైతే ఏపీలో స్లీపర్ బస్సు బ్యాన్ చేస్తాం
Sleeper Bus : ఈమధ్య కాలంలో తరచుగా బస్సుల్లో మంటలు చెలరేగడం వంటి ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా బస్సుల్లో ప్రమాదాల నివారణపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రవాణా, పోలీస్, ఫైర్ సేఫ్టీ అధికారులతో సమావేశమయ్యారు. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బస్సుల్లో ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించాం. రోడ్లపై బ్లాక్ స్పాట్ల నివారణ, వాహనాల కండిషన్లను నిరంతరం తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణ కోసం రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
‘‘కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లిలో ట్రావెల్స్ ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణం. రాష్ట్రంలో 13-16 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయి నిబంధనలను ఉల్లంఘించి తిరిగే వాహనాలను సీజ్ చేశాం. చట్టాలను అడ్డం పెట్టుకుని తప్పులు చేసే వారిపై చర్యలు తప్పవు. పది రోజుల్లో 10 వేల వాహనాల తనిఖీలు చేశాం. తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేటు ట్రావెల్స్ కు ఆదేశాలు జారీ చేశాం. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే రాష్ట్రంలో టాక్సేషన్ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇతర రాష్ట్రాల వాహనాలు రాష్ట్రంలో ఎక్కువగా తిరుగుతున్నాయి. త్వరలో బస్సుల్లో సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. ఎక్కడా రాజకీయ ప్రమేయం లేకుండా ప్రమాద కారకులపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
‘‘300 కిలోమీటర్ల పైన నడిచే బస్సుల్లో డబుల్ డ్రైవర్లను తప్పక నియమించేలా చర్యలు తీసుకుంటాం. రహదారులపై అతివేగం నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. బస్సులు సమయ వేళలు తప్పక పాటించేలా చర్యలు తీసుకుంటాం. బస్సులు సమయ పాలన పాటించకపోతే నగర శివార్లలోనే ఆపేలా చర్యలు తీసుకుంటాం. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత 50 బస్సులు సీజ్ చేస్తే కోర్టుకు వెళ్లి విడుదల చేయించుకున్నారు’’ అన్నారు.
‘‘స్లీపర్ బస్సులను ఎందుకు బ్యాన్ చేయకూడదనే విషయమై చర్చిస్తున్నాం. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశాం.. అవసరమైతే భవిష్యత్తులో తప్పకుండా స్లీపర్ బస్సులను రద్దు చేస్తాం. జాతీయ, రాష్ట్ర రహదారులపై స్పీడ్ గన్లను ఏర్పాటు చేసేలా రూ. 40 కోట్లు కేటాయించాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. అన్ని బస్సుల్లో డ్రైవర్ల పర్యవేక్షణకు ఏఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పుకొచ్చారు.
