జలవివాదంపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్

జలవివాదంపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్

Updated On : October 6, 2020 / 9:53 AM IST

జలవివాదాలకు వాదనలతో సిద్ధమయ్యాయి తెలుగు రాష్ట్రాలు. మంగళవారం జరిగే Apex council meetingలో దీనికి వేదిక కానుంది. కేంద్రం కూడా ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది. 4 అంశాలను అజెండాగా నిర్ణయించినప్పటికీ, వీటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చేలా ఉన్నాయి. అపెక్స్‌ కౌన్సిల్‌ ఎజెండాలోని అంశాలపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సోమవారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, కేంద్ర జల్‌శక్తి అధికారులతో చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు లేవనెత్తే అవకాశం ఉన్న అంశాల గురించి.. సీఎం కేసీఆర్‌ లెటర్‌లో ప్రస్తావించిన విషయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. బోర్డులు ఏర్పడి ఆరేళ్లు దాటినా ఇప్పటి వరకూ పరిధిని గమనించకపోవడం, దాంతో తలెత్తుతున్న సమస్యల గురించి, రాష్ట్రాల అభిప్రాయాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయనే దానిపై మంత్రి తెలుసుకున్నారు. ఇందులో పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్ల సంబంధిత వర్గాలు వెల్లడించాయి.



బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంటుండగా.. నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. ఇప్పటికే ఉన్న నాగార్జునసాగర్‌తోపాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్‌ చేయనుండగా.. రెండు ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఏపీ కోరనున్నట్లు తెలిసింది.

ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలంగాణ.. పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల గురించి ఆంధ్రప్రదేశ్‌ లేవనెత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టుల డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టులు ఇవ్వాల్సిందేనని, దీనిపై కూడా సమావేశంలో స్పష్టంగా చెప్పాలని కేంద్ర మంత్రి సంబంధిత అధికారులతో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని, కొత్తవి చేపట్టకుండా డీపీఆర్‌లు ఎలా ఇస్తామని తెలంగాణ ప్రశ్నిస్తోంది. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే ఉన్న ట్రిబ్యునల్‌ కొనసాగుతుందని.. గోదావరిలో మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ అంగీకారానికి రాకపోతే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు అవసరం గురించి కేంద్ర మంత్రి చర్చించినట్లు తెలిసింది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటా విషయాన్ని తేల్చే బాధ్యతనూ ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కే వదిలిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌లపై విమర్శలు గుప్పిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రికి అక్టోబరు 2న లేఖ రాసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం కూడా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. అంతర్‌ రాష్ట్ర జలవివాద చట్టం – 1956లోని సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా జలాలపై విచారణ జరపాలని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో గట్టిగా కోరనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని డిమాండ్‌ చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని మరోసారి స్పష్టం చేయనున్నారు.

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీలో అధికారులతో ఈ విషయమై మరోమారు చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ ఏపీ భవన్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు శ్రీశైలంలో 800 అడుగుల నుంచీ నీటిని తీసుకోవచ్చని.. ఏపీలోని ప్రాజెక్టులకు ఆ వెసులుబాటు లేదని, అందుకే రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకతను వివరించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో విజయవాడకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తరలించాలని అనుకున్నారు. దానిని ఇప్పుడు కర్నూలు, వైజాగ్‌లకు తరలించాలని చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌ నుంచి కేసీఆర్‌.. ఢిల్లీ నుంచి జగన్‌..
తెలంగాణ సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌ నుంచి వీడియో ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీలోని ఏపీ భవన్‌ నుంచి అధికారులతో పాటు వీడియో ద్వారా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటున్నారు.