AP Rain Alert : 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..!
AP Rain Alert : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది.
APSDMA rain alert due to low pressure likely over bay of bengal in 48 hours
AP Rain Alert :వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే, ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మే నెలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అని భయపడ్డ జనాలకు.. ఊహించని రీతిలో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వానలు కాస్త ఊరటనిస్తున్నాయి. కానీ పంట చేతికొచ్చే సమయంలో ఇలా ఈదురుగాలులతో వర్షాలు కురవడంతో అన్నదాతల వ్యధ వర్ణనాతీతంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండానే నీటిపాలవుతోంది.
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీలంక పరిసరాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 48 గంటల వ్యవధిలో.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బిహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ఈ ద్రోణి విస్తరించబోతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నాలుగు రోజుల్లో, అంటే గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.
అలాగే పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించారు. దీనితో పాటు గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో ఆదివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
