మొన్నటి వరకు వాచ్ మెన్, ఇప్పుడు గ్రామానికే సర్పంచ్

Uppalapadu Prakasam Dist : మొన్నటివరకు అతను వాచ్‌మన్. పంచాయతీ ఎన్నికలు అతనికో హోదాను తెచ్చిపెట్టాయి. గ్రామానికే సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ప్రకాశం జిల్లా ఉప్పలపాడు వాసుల ఆదరణ చూరగొన్న ఏసేబు.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్నాడు. మొన్నటివరకు సాదాసీదా జీవితం. లుంగీ చొక్కాలో కనిపించేవాడు. బేల్దారిమేస్త్రీ, కూలీ, వాచ్‌మన్‌గా జీవనం సాగించేవాడు. ఇప్పుడు గ్రామ ప్రజలంతా గౌరవించే సర్పంచ్ పదవిని అధిష్టించాడు. దీంతో రాజకీయ నేతల మాదిరే తెల్ల దుస్తులు ధరిస్తున్నారు. సచివాలయానికి వాచ్‌మన్‌గా ఉన్న గుంటూరి ఏసేబు… ఇప్పుడదే సచివాలయంలోని సర్పంచ్ సీటులో కూర్చుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో గుంటూరి ఏసేబు హాట్‌టాపిక్ అయ్యాడు. కర్రపట్టుకుని కాపలా ఉన్న చోట అధికారం చెలాయించే పెత్తనమూ కట్టబెట్టారు ఉప్పలపాడు గ్రామస్తులు. సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో..పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏసేబును గెలిపించారు గ్రామస్తులు. స్థానిక వైసీపీ నేత, వ్యాపారవేత్త ఉలవ గోపి మద్దతుతో ఈజీగా విజయం సాధించాడు ఏసేబు. గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్.. పెద్దల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు.
తమ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం ఇదని తనయుడు పొంగిపోతుంటే… మా ఆయన బంగారం అంటోంది భార్య మరియమ్మ. గ్రామంలో మంచి వ్యక్తిగా పేరుంది కాబట్టే తన మామ నుంచి గ్రామస్తులు సుపరిపాలన ఆశించారన్నారు అల్లుడు రమేష్. అందివచ్చిన అవకాశంతో గ్రామానికి సర్పంచ్ అయిన ఏసేబు…రాజకీయాల్లో రాణిస్తారని స్థానికులు విశ్వసిస్తున్నారు.