Cm Jagan Attack Case : సీఎం జగన్‌‍పై దాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

ఈ కేసుతో సతీశ్ కు సంబంధం లేదన్న లాయర్ సలీమ్.. సతీశ్ కు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.

Cm Jagan Attack Case : సీఎం జగన్‌‍పై దాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

Cm Jagan Attack Case

Cm Jagan Attack Case : ఏపీ సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు సతీశ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. 307 సెక్షన్ కింద నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నాడు సతీశ్.

కోర్టు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకి తరలించారు. సీఎం జగన్ ను హతమార్చే ఉద్దేశ్యంతోనే నిందితుడు సతీశ్ రాయితో వచ్చాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. సతీశ్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసకున్నామని, కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించారు.

నిందితుడు సతీశ్ తరుపున రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తరుపు న్యాయవాది సలీమ్ తెలిపారు. ఈ కేసుతో సతీశ్ కు సంబంధం లేదన్న లాయర్ సలీమ్.. సతీశ్ కు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.

కాగా.. సీఎం జగన్ ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు సతీశ్ రాయితో కొట్టాడని పీపీ తన వాదనలు వినిపించారు. కీలకమైన భాగంలో గాయమైందని కోర్టుకు వెల్లడించారు. అయితే, అది కీలకమైన భాగం కాదని.. ఆ గాయం రాయితో కొట్టడం వల్ల వచ్చింది కాదని, గజమాలకు ఉండే మేకులు గుచ్చుకుని ఉండొచ్చని, వెదురు కర్రలు తగిలి గాయమై ఉండొచ్చని తాము వాదనలు వినిపించామని నిందితుడు తరుపు న్యాయవాది సలీమ్ తెలిపారు. నిందితుడు సతీశ్ 2006లో పుట్టాడని అతడి తల్లిదండ్రులు అంటున్నారు.. పోలీసులేమో 2005లో జన్మించాడని అంటున్నారు.

దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని బెయిల్ కు దరఖాస్తు చేస్తామన్నారు లాయర్ సలీమ్. కరెంట్ కట్ అనేది నిందితుడు సతీశ్ పరిధిలోకి రాదని, విద్యుత్ విభాగం పరిధిలోకి వస్తుందని, కరెంట్ ఎందుకు కట్ అయ్యింది? అనేది విద్యుత్ విభాగం వాళ్లే చెప్పాలని సతీశ్ తరుపు లాయర్ అన్నారు. అసలేం జరిగింది? అనేది ఎవరికీ తెలియదన్నారు లాయర్ సలీమ్.

Also Read : సీఎం జగన్‌‌ను హత్య చేసేందుకే దాడి- రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు