Vasamsetti Subhash: మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా?
సొంత జిల్లాలో ఆయనపై ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

Vasamsetti Subhash
కార్యకర్తగా నుంచి ఎమ్మెల్యే.. ఆ తర్వాత అదృష్టం కలసి వచ్చి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. తర్వాత రామచంద్రపురం టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది.
అలా సుభాష్ పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అదృష్టం తన తలుపు తట్టినట్లే.. ప్రతి పనిలో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదట. ఏదో ఒక రూపంలో చిక్కులు, చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేసిన ఏదో ఒక వివాదానికి దారితీస్తూనే వస్తుందట. అటు అధిష్టానం నుంచి ఇటు క్షేత్రస్థాయిలో తన సామాజికవర్గం వరకు ఆయనపై వ్యతిరేకత చాప కింద నీరులా వ్యాపిస్తుందట.
ఆడియో బయటికి రావడంతో హాట్ టాపిక్
ఎమ్మెల్సీ ఓట్లు నమోదు విషయంలో సరిగా పనిచేయలేదని ఆ మధ్య సీఎం చంద్రబాబు సుభాష్‌ను మందలించిన ఆడియో బయటికి రావడం హాట్ టాపిక్ అయింది. అధినేత చీవాట్లపై స్పందించిన మంత్రి సుభాష్ చంద్రబాబు తండ్రి లాంటి వారని ఆయన తిట్టినా కొట్టినా ఫర్వాలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబు చీవాట్లతో పాటు అసెంబ్లీకి ఆలస్యంగా వెళ్లి మందలించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు మంత్రి సుభాష్. సభకు మంత్రులే లేటుగా వస్తే ఎలా అంటూ స్పీకర్ సీరియస్ కావడంతో సారీ చెప్పి సర్ధిచెప్పుకున్నారు.
సరే ఆ రెండు ఇష్యూస్ అంతటితో అయిపోయాయని అనుకుంటే తన నియోజకవర్గంలో కూటమి నేతలతో సుభాష్‌కు పొసగడం లేదట. తన గెలుపు కోసం కష్టపడిన కూటమి నేతలకు..మంత్రి సరైన గౌరవం ఇవ్వకపోవడంతో అందరూ దూరంగా ఉంటున్నారు. టీడీపీ సీనియర్ లీడర్లతో పాటు జనసేన, బీజేపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు సుభాష్‌కు దూరంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో ఆయనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కష్టపడి పనిచేసిన తమను పక్కనపెట్టి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారని సుభాష్‌పై మండిపడుతోంది కూటమి క్యాడర్.
ఒక వర్గం వ్యతిరేకించడంతో ఘర్షణ
ఇక లేటెస్ట్‌గా శెట్టిబలిజ వనసమారాధన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగా ఒక వర్గం వ్యతిరేకించడంతో ఘర్షణకు దారి తీసింది. మంత్రి సొంత సామాజిక వర్గంలో రెండుగా చీలి తిట్టుకుని గొడవ పడ్డారు నేతలు. ఇటు అమలాపురంలోనూ..అటు రామచంద్రపురంలోనూ శెట్టిబలిజ వనభోజనాలు జరుగుతున్నప్పటికీ మంత్రి ఫోటో, పేరు ప్రస్తావన లేకుండా కార్యక్రమాలు చేసుకుంటున్నారు.
అంటే సొంత జిల్లాలో ఆయనపై ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా తనకు తెలియకుండానే ఇటు అధిష్టానంతోనూ అటు గెలిపించిన సీనియర్ నేతలతో పాటు తన సొంత సామాజికవర్గంలో కూడా వ్యతిరేకతను సొంతం చేసుకున్నారు మంత్రి సుభాష్.
ఇప్పటికైనా మంత్రి తన తీరు మార్చుకోవాలంటున్నారు కూటమి నేతలు. సీనియర్ నేతలకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చుకుంటూ..తన సామాజికవర్గాన్ని కలుపుకుపోతే బెటర్ అని సూచిస్తున్నారు. అందరినీ కలుపుకుపోతేనే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయడం ఈజీ అవుతుందన్న విషయాన్ని మంత్రి గమనించాలంటున్నారు నేతలు.
Revanth Reddy: సీఎంవో అధికారులు సీఎం స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారా?