ఫేక్ సర్టిఫికెట్లతో బ్యాంకుకి టోపీ, ఏకంగా రూ.11కోట్ల రుణం ఎగవేత

స్మార్ట్‌గా యాక్ట్ చేశాడు. పక్కోడికి కూడా తెలీకుండా అక్రమ డాక్యుమెంట్లు సంపాదించాడు. ఫేక్ సర్టిఫికేట్లు.. లేని ఆస్తులతో బ్యాంకులను బురిడీ కొట్టించి రుణం సంపాదించాడు. ఇంకేముంది డబ్బులు చేతికొచ్చాక పత్తాలేకుండా పరారయ్యాడు. ఇదంతా చేసింది ఏదో చిల్లర దొంగతనాలు చేసే వ్యక్తి కాదు.. విశాఖ జిల్లాకు చెందిన ఓ బడాబాబు. గొలుగొండ మండలం ఏఎల్‌పురానికి చెందిన శ్యామ్ కల్యాణ్ చక్రవర్తి బ్యాంకుకు ఏకంగా 11 కోట్ల రూపాయలు టోపీ పెట్టాడు. తీరా బకాయిలు కట్టకపోవడంతో వివరాలు ఆరా తీసిన బ్యాంకు అధికారులు మోసపోయామని తెలిసి ఖంగుతిన్నారు.
ఏఎల్‌పురానికి చెందిన శ్యామ్ కల్యాణ్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో జీడిపిక్కల కమిషన్ వ్యాపారం చేస్తున్నాడు. అనకాపల్లిలో జీడిపిక్కల గోదాము నిర్వహిస్తున్నాడు. డబ్బు కోసం 2017లో అనకాపల్లిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాను సంప్రదించాడు. గొలుగొండ మండలంలో 16మంది రైతులకు చెందిన జీడిపిక్కలు తన గోదాములో నిల్వ ఉన్నట్లు ఫేక్ ఆధారాలు చూపించాడు. ఇటు రైతులకు మాయమాటలు చెప్పి వారి పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించాడు.
ఈ పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి ఏకంగా 11 కోట్ల రుణం తీసుకున్నాడు. ఇందులో సుమారు కోటి రూపాయల వరకూ నమ్మకంగా చెల్లించాడట. మిగిలిన బకాయిలు చెల్లించకపోవడం.. ఫోన్ కాల్స్‌కు శ్యామ్ స్పందించకపోవడంతో రంగంలోకి దిగిన బ్యాంకు అధికారులు జరిగింది తెలుసుకొని నివ్వెరపోయారు. కనీసం తనఖా పెట్టిన భూములైనా సీజ్ చేసేందుకు వెళ్లి షాకయ్యారు. అవి కూడా ఫేక్ డాక్యుమెంట్లని తేలడంతో అవాక్కయ్యారు. చేసేదేం లేక అనకాపల్లిలోని జీడిపిక్కల గోదామును సీజ్ చేశారు.
ఇక 11 కోట్ల రూపాయలు, రుణ మంజూరుకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో తనఖాగా పెట్టిన 16 మంది రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై అధికారులు దృష్టిసారించారు. ఈ భూములకు సంబంధించిన వివరాలను గొలుగొండ మండల రెవెన్యూ కార్యాలయానికి పంపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక అందించాలని కోరారు. దీంతో వీఆర్వోలు రెండు మూడు రోజులుగా పాతమల్లంపేట, ఏఎల్ పురం, కృష్ణదేవిపేట గ్రామంలో పర్యటించారు. రైతులతో భూమి వివరాలపై మాట్లాడారు.
వివరాలు ఆరా తీసిన వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది కూడా విస్తుపోయారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదైన పేర్లు, సర్వే నంబర్లు, రెవెన్యూ గ్రామాలకు పొంతన లేదని గుర్తించారు. రైతుల పేర్లకు భూములకు, సర్వే నెంబర్లకు, ఆయా ఊర్లకు కూడా ఎక్కడా సంబంధాలు లేకపోగా, అసలు రికార్డుల్లో కూడా లేకపోవడం చూసి షాకయ్యారు. అంతేకాదు ఆ గ్రామాల్లోని రైతులు అనకాపల్లి బ్యాంకులో తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని తేల్చి చెప్పడంతో నిర్ఘాంతపోయారు. ఈ వివరాలను రెవెన్యూ అధికారులు బ్యాంక్‌కు పంపారు. రుణం తీసుకున్న రైతుల పేరిట ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ ఫేక్ అని తేల్చి చెప్పడంతో బ్యాంక్ అధికారులు ఖంగుతిన్నారు.