రూ.400 కోసం రూ.97వేలు పొగొట్టుకున్నాడు.. యూపీఐ పేమెంట్స్‌తో జాగ్రత్త
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్ తో మోసానికి పాల్పడ్డాడు సైబర్ క్రిమినల్. ఏకంగా రూ.97వేలు నొక్కేశాడు.

Becareful With Upi Payments
Becareful With UPI Payments: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్ తో మోసానికి పాల్పడ్డాడు సైబర్ క్రిమినల్. ఏకంగా రూ.97వేలు నొక్కేశాడు. యూపీఐ పేమెంట్స్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. రూ.400 కోసం ఏకంగా రూ.97వేలు పొగొట్టుకున్నాడు గుంటూరుకి చెందిన నాగరాజు అనే వ్యక్తి.
నగరంలోని ఐపీడీ కాలనీకి చెందిన నాగరాజు క్యాటరింగ్ చేస్తున్నాడు. తన మిత్రుడు అత్యవసరంగా రూ.400 కావాలంటే ఫోన్ పే ద్వారా యూపీఐ ట్రాన్సఫర్ తో పేమెంట్ చేశాడు. కానీ తన అకౌంట్ లో డబ్బు జమ కాలేదని స్నేహితుడు చెప్పాడు. దీంతో ఫోన్ పే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమస్యను చెప్పాడు నాగరాజు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్.. ఆ డబ్బుని రీఫండ్ చేస్తామని చెప్పాడు. కాసేపటికే.. అజ్ఞాత వ్యక్తి నాగరాజుకి ఫోన్ చేశాడు. తన పేరు ప్రసాద్ అని, ఫోన్ పే కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. రూ.400 తిరిగి జమ చేస్తామని అతడిని నమ్మించాడు.
కాగా, ఫోన్ కి పంపిన వెరిఫికేషన్ కోడ్ చెప్పాలని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. అతడు చెప్పినట్టే.. ఆ కోడ్ చెప్పిన వెంటనే నాగరాజు అడ్డంగా మోసపోయాడు. అతడి అకౌంట్ నుంచి రూ.49వేల 248 విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో నాగరాజుకి దిమ్మతిరిగింది. ఆ డబ్బు ఎందుకు డ్రా అయ్యాయని నాగరాజు అడగ్గా.. మరో కోడ్ పంపామని.. అది చెప్తే మొత్తం డబ్బు జమ చేస్తామన్నాడు. పాపం మళ్లీ నమ్మి ఆ కోడ్‌ను చెప్తే మరో రూ. 48,657 నాగరాజు అకౌంట్ నుంచి మాయం అయ్యాయి.
ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో తాను మోసపోయాయినట్లు నాగరాజుకి అర్ధమైంది. రూ.400 కోసం మొత్తం రూ.97 వేలు పోగొట్టుకుని లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సో..యూపీఐ పేమెంట్స్ తో బీ కేర్ ఫుల్. కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.