ఏపీలో అసాధ్యాలను సుసాధ్యం చేశాం: కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
కూటమి ఏర్పడడానికి పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారని అన్నారు.

Bhupathi Raju Srinivasa varma
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 10టీవీ నిర్వహించిన మెగా ఈవెంట్ “షైనింగ్ ఏపీ”లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొని మాట్లాడారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అసాధ్యాలను సుసాధ్యం చేశామని తెలిపారు.
“కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం పూర్తయింది. నా పని తీరుపై నేను పూర్తిగా సంతృప్తితో ఉన్నాను. ఈ ఏడాది పాలనలో కేంద్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కేంద్రం, రాష్ట్రంలో ఓ పక్కన సంక్షేమానికి, మరోపక్క అభివృద్ధికి కూడా పెద్ద పీట వస్తూ వాటి రెండింటి మధ్యన కూడా సమతుల్యం పాటిస్తూ చక్కటి పరిపాలన కొనసాగుతోంది.
ఈ అభిప్రాయం నాలో కాదు.. ప్రజల్లో ఉంది. రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చూసి, ఆ ప్రభుత్వం అనుసరించిన అనేక విధానాల పట్ల ప్రజలు విసుగు చెందారు. మరొకసారి వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా అధోగతి పాలవుతుంది.
ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయాం అనే ఆలోచనతో, ముందుచూపుతో మూడు పార్టీలు కలిశాయి. దీనికి ప్రత్యేకమైన
చొరవ పవన్ కల్యాణ్ తీసుకున్నారు. ఈ మూడు పార్టీల కలయికకు అనుకూలంగా ఏకపక్షంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి బేషరతుగా చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి మీద కేంద్రానికి ఒక కొంత ప్రణాళిక ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఓట్లను ఆకర్షించడానికి లేనిపోని తగువులు సృష్టించుకుని కేంద్రంతో పోరాడుతున్నాం అంటున్నారు.
రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించలేక కేంద్రంతో దెబ్బలాడుతూ కేంద్రం కారణంగా ఈ సమస్య పరిష్కారం కావడంలేదని బురదచల్లుతున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అభివృద్ధి మరింత ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుందని చెబుతోంది” అని అన్నారు.