murder case : హత్య కేసులో నిందితులను పట్టించిన సైకిల్ తాళం..

చిన్న తప్పు చివరికి ఎంత పెద్ద దొంగనైనా పట్టిస్తోంది. ఓ వ్యక్తి హత్య కేసులో సైకిల్‌ తాళం, సాంకేతికత నిందితులను పట్టించింది.

murder case : హత్య కేసులో నిందితులను పట్టించిన సైకిల్ తాళం..

Murder Case

Updated On : March 23, 2021 / 8:54 PM IST

Bicycle lock that deceived the accused in the murder case : దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేసి కొంతమంది దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుంటారు. కానీ చిన్న తప్పు చివరికి ఎంత పెద్ద దొంగనైనా పట్టిస్తోంది. ఓ వ్యక్తి హత్య కేసులో సైకిల్‌ తాళం, సాంకేతికత నిందితులను పట్టించింది. అసలు నిందితులను జైలుకు పంపించింది. సంచలనం రేపిన కాకినాడ రూరల్ పరిధిలోని కరప మండలం నడకుదురులో వ్యక్తి హత్య కేసును వారం రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. హత్యగావించబడిన వ్యక్తి రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన పేపకాయల సతీష్‌కుమార్‌ (35)గా గుర్తించారు.

వివాహేతర సంబంధం కారణంగా అతని వేధింపులు తాళలేని ఓ మహిళ తన సోదరి సహకారంతో పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 16న కరప మండలం నడకుదురు శివారులో ఓ ఖాళీ స్థలంలో తుమ్మ చెట్ల పొదల కింద కాలిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యంత కిరాతకంగా అతన్ని కాల్చి చంపేశారు. ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం..మైక్‌ సెట్‌లు అద్దెకు ఇస్తూ.. రైస్‌ మిల్లులో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేసే సతీష్‌కుమార్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్ధానిక రజకవీధికి చెందిన తోట అర్జవేణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సతీష్‌కుమార్‌ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం అర్జవేణికి తెలియడంతో తన వద్దకు రావొద్దని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన అతను మార్చి 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అనంతరం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడు. అర్జవేణికి తరచూ ఫోన్‌ చేసి భర్త, పిల్లలను విడిచి తనతో వచ్చేయాలని వేధింపులకు గురిచేసేవాడు.

ఈ వేధింపులు భరించలేక ఆమె తన అక్క నడకుదురుకు చెందిన ఐరెడ్డి రాజేశ్వరి సహాయం కోరింది. సతీష్‌కుమార్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారు. ఈ నెల 15న ఉదయం అతన్ని నడకుదురుకు రప్పించారు. వారి పథకం ప్రకారం ముందుగా ఆ గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్‌ను ఖాళీ డ్రింక్‌ బాటిల్‌లో వేరే వ్యక్తి సహాయంతో తెప్పించుకుని సతీష్‌కుమార్‌ను నేర స్థలానికి తీసుకెళ్లారు. అక్క రాజేశ్వరి సహాయంతో సతీష్ కుమార్ ను హత్యచేసి ఆపై మృతదేహం గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు పాటించారు. అనంతరం హైదరాబాద్‌కు పరారయ్యారు.

పోలీసులకు నేర స్థలం వద్ద లభించిన సైకిల్‌ తాళం వెల్ల గ్రామంలో హత్యకు గురైన సతీష్ కుమార్ ఇంటి వద్ద ఉన్న సైకిల్‌కి సరిపోవడంతో ఇది దర్యాప్తులో కీలకమైంది. అలాగే అక్కచెల్లెళ్ల కాల్‌ రికార్డింగ్‌లు, వారు హత్యా స్థలం వద్దకు వెళ్లేటప్పుడు పెట్రోల్‌ ఉన్న సంచి, తిరిగి వచ్చేటప్పుడు సీసీ కెమెరాలోని చిత్రాలు, ఇతర సాంకేతిక అంశాలు నిందితులను పట్టుకోవడంలో సహాయ పడ్డాయి.