రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్టానం క్లారిటీ? వీరిద్దరిలో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి?
పొలిటికల్ సిచ్యువేషన్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం అంటోందట.

Arvind Dharmapuri, Raghunandan Rao
ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. దాంతో నేతలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
ఈ క్రమంలో తెలంగాణ కాషాయ దళపతి రేసులో చాలా మంది నేతల పేర్లు వినిపించాయి. బండి సంజయ్‌ని మళ్లీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్‌కు పార్టీ పగ్గాలు ఇస్తారని లీకులు వచ్చాయి. డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచందర్‌రావు పేర్లు పార్టీ అధ్యక్ష రేసులో బలంగా వినిపించాయి. అయితే అందరినీ కలుపుకుపోయే ఫైర్ బ్రాండ్ లీడర్ కోసం అధిష్టానం దృష్టి పెట్టిందట.
తెలంగాణలో ఎనిమిది ఎంపీలను గెలుచుకున్న బీజేపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం చేజిక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఈసారి పార్టీ అధ్యక్షుడి ఎంపికలో చాలా అంశాలను బేరీజు వేసుకుంటోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటికి వస్తుండటంతో ఎంతకు కొలిక్కి రావడం లేకుండా పోయింది. పార్టీలో అంతర్గతంగా ఏ ఇద్దరు నాయకులు కలిసినా కొత్త సారధి ఎవరనే దానిపైనే చర్చ జరుగుతోంది.
ప్లస్‌లు, మైనస్‌లపై డిస్కషన్స్
ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తుండగా ..వాళ్ల ప్లస్‌లు, మైనస్‌లపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుందని అభిప్రాయ సేకరణ చేస్తుందట పార్టీ హైకమాండ్. కాస్త దూకుడుగా ఉంటూ, అందరిని కలుపుకుపోతూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే నేత కోసం సెర్చ్ చేస్తోందట కమలం పార్టీ అధిష్టానం.
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీని ఎంపిక చేయాలని ఆలోచన చేస్తున్నారట బీజేపీ పెద్దలు. అయితే ఎంపీగా ఉన్న నేతను అధ్యక్షుడిగా నియమిస్తేనే బెటర్ అనే భావనకు బీజేపీ హైకమాండ్ వచ్చిందట. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో..ఎనిమిది ఎంపీల్లో ఐదుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు రేస్‌లో ఉన్నారన్నది బీజేపీ వర్గాల సమాచారం. ఈ ఐదుగురిలో ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్నదానిపై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు హస్తిన పెద్దలు. అయితే ఫైనల్‌గా ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లను ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎవరి స్టాయిలో వారు లాబీయింగ్?
ఈ క్రమంలోని ఎవరి స్టాయిలో వారు లాబీయింగ్ నే అరవింద్, రఘునందన్ రావు..ఇద్దరు పార్టీ పెద్దలకు తమ మనసులోని మాట చెప్పుకుని ఎవరి స్టాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారట. అయితే పార్టీ అధిష్టానం మనసులో ఏముందోనన్న సస్పెన్స్ అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు బీసీ అజెండాతో ముందుకు వెళ్ళాలని తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు చెబుతున్నారట.
కానీ, పొలిటికల్ సిచ్యువేషన్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం అంటోందట. దాంతో ఈ సారి రాజకీయ అవసరాల కోణంలో తెలంగాణ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పక్కాగా పొలిటికల్ అవసరాలు తీర్చేలా కొత్త అధ్యక్షుడి సెలక్షన్ ఉంటుందన్న ఢిళ్లీ పెద్దలు ఇప్పటికే ఇండైరెక్ట్‌గా చెప్పేశారట. దీంతో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులలో ఎవరిని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది.
వైసీపీ ముందస్తు నిరసనలతో టీడీపీకే లాభమా? వైసీపీ నిరసనలకు అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదా?