చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి.. తరలిరానున్న బీజేపీ అగ్ర నేతలు, అతిరథ మహారథులు

చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వీఐపీలు తరలి వస్తున్నారు. వారి రాకతో గన్నవరం ఎయిర్ పోర్టు కళకళలాడుతోంది. రద్దీగా మారింది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి.. తరలిరానున్న బీజేపీ అగ్ర నేతలు, అతిరథ మహారథులు

Updated On : June 11, 2024 / 7:53 PM IST

Chandrababu Oath Taking Ceremony : ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు రేపే(జూన్ 12) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాణ మహోత్సవంలో పాల్గొంటారు. పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీల అధ్యక్షులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తరలి రానున్నారు. ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ చేరుకోనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ విజయవాడ చేరుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు.. ఇవాళ రాత్రి చంద్రబాబు నివాసానికి రానున్నారు. రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ముందు రోజే అమరావతి వస్తున్న అమిత్ షా.. ఇవాళ రాత్రి 10.30కు చంద్రబాబును కలవనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతల భేటీ జరగనుంది. ఢిల్లీ నుంచి రాత్రి 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు అమిత్ షా, నడ్డా. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్తారు. చంద్రబాబుతో భేటీ అనంతరం 11.20 గంటలకు నోవాటెల్ హోటల్ లో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం నోవాటెల్ నుంచి బయలుదేరి కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షా, నడ్డా అటెండ్ అవుతారు.

స్పెషల్ ఫ్లైట్ లో చిరంజీవి ఫ్యామిలీ
చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వీఐపీలు తరలి వస్తున్నారు. వారి రాకతో గన్నవరం ఎయిర్ పోర్టు కళకళలాడుతోంది. రద్దీగా మారింది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో చిరంజీవి కుటుంబం విజయవాడ చేరుకుంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరవుతున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో పరిశీలన చేస్తున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టులో ఆంక్షలు..
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో గన్నవరం ఎయిర్ పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని వెల్లడించారు.

Also Read : ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది? లక్ష్య సాధనకు చేయాల్సింది ఏంటి?

అతిథులకు చంద్రబాబు విందు
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ లో ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. 7వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. గన్నవరం, కేసరపల్లి జంక్షన్ రూట్లన్నీ పోలీసు బలగాలతో నిండిపోయాయి. వీవీఐపీలు విజయవాడకు తరలివస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా రాత్రికి రాబోతున్నారు. వీరందరికి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాత్రికి విందు ఇవ్వబోతున్నారు.